అవగాహనతోనే భద్రత సాధ్యం | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే భద్రత సాధ్యం

Published Thu, Jan 2 2014 12:24 AM

safety possible with awareness

పరిగి, న్యూస్‌లైన్: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి రోడ్డు ఎక్కితేగాని కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మనిషి తిరిగి వచ్చేంత వరకు నమ్మకం లేకుండాపోయింది. ప్రతి మనిషికి వాహనాలతో అవినాభావ సంబంధం ఏర్పడింది. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నప్పటికి ప్రమాదాలు జరుగుతూన ఉన్నాయి. సంస్థాగతమైన, సామాజికపరమైన మార్పులు చోటు చేసుకోనంత వరకు భద్రత అందనంత దూరంలోనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

 చైనా లాంటి దేశాల్లో సైకిల్‌పై వెళ్లే వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధన ఉండగా మనం మోటార్ సైకిళ్లకే ఈ నిబంధనను వర్తింపజేయడంలో విఫలమవుతున్నాం. వాహనాలతో వచ్చే రెవెన్యూ కంటే ప్రమాదాల్లో నష్టపోయేదే ఎక్కువగా ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల భారం మన జీడీపీపై కూడా ఉంటోందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు కొనసాగనున్నాయి.

 కారణాలు - నివారణ మార్గాలు
 నేరాల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల శాతమే ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10నుంచి 15 వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేస్తున్నప్పటికి అవి మన అవరాలకు సరిపోవడం లేదు. రోజురోజు పెరుగుతున్న  జనాభా, వాహనాల వాడకంతో పోలిస్తే రోడ్లు వేయటం, మనం అనుసరిస్తున్న విధానాలు ఏ మాత్రం సరిపోవటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 70 శాతం నుంచి 80 శాతం వరకు రోడ్లు బాగాలేక, 15 శాతం అవగాహన లోపంతో, 5 శాతం మిగితా కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా వాడడం, పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండడం. జాగ్రత్తగా వాహనాలు నడపడం.  (సేఫ్టీ ప్యాసింజర్ సిస్టం) రోడ్లపై ఆటోల్లో, ట్రాక్టర్లలో, లారీల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గడంతోపాటు రోడ్లపై (4 వీలర్) బస్సులు ప్రయాణికులకు సరిపోయే స్థాయిలో రావడం. ఆర్టీసీ తమ సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంది.

 సంస్థాగతమైన మార్పులు అవసరం
 ప్రమాదాల నివారణలో రోడ్డు తనిఖీ విభాగం, రవాణా శాఖల్లో సంస్థాగతమైన మార్పులు వస్తే తప్ప ప్రమాదాల శాతం తగ్గించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీఏ అధికారులను ఎక్కువ సంఖ్యలో నియమించడం ద్వారా రోడ్డు, వాహనాలను తనిఖీ చేయటం, విద్యార్థులకు, వాహనదారులకు అవగాహన కల్పించడం నిరంతర ప్రక్రియగా మార్చడం, అవగాహన కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావడం వంటి సంస్థాగతమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement