కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో అమ్మాయిల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అనంతపురం ఎడ్యుకేషన్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో అమ్మాయిల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ విధానంలో అమలువుతున్న కేజీబీవీల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వారం రోజుల కిందట జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వనీయ సమాచారం మేరకు...సదరు కేజీబీవీ నుంచి ఇద్దరు అమ్మాయిలు రాత్రి 11 గంటల సమయంలో బయటకు వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున 3 గంటల సమయంలో కేజీబీవీకి వచ్చారు. ఇదే సమయంలో సిబ్బంది వారిని గుర్తించారు. మరసటి రోజు ఉదయాన్నే బంధువులను పిలిపించి అ ఇద్దరి అమ్మాయిలను పంపించేశారు.
అయితే రాత్రి విధుల్లో ఉండాల్సిన కేజీబీవీ ఉద్యోగులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. వారు తిరిగి వచ్చేవరకు విషయం తెలీదంటే సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. రాత్రి సమయంలో అందులో అమ్మాయిలు ఎక్కడికెళ్లారు అనేది అంతుచిక్కడం లేదు. కేజీబీవీ గేటు ద్వారా కాకుండా కాంపౌండ్ దూకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎక్కడికెళ్లారనే దానిపై ఆరా తీస్తే...భయంకరమైన విషయం వెలుగుచూస్తోంది. ఇద్దరు యువకులు వచ్చి ఆ అమ్మాయిలను తీసుకెళ్లినట్లు తెలిసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఊరి చివర్లో ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తిరిగి కేజీబీవీ కాంపౌండు దూకే సమయంలో కొందరు గుర్తించినట్లు సమాచారం.
కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది
అసలు విషయం తెలిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని భావించిన కేజీబీవీ సిబ్బంది విషయం బయటకు పొక్కకుండా కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా అమ్మాయిల బంధువులను పిలిపించి వారికి అసలు విషయం చెప్పి పంపినా....ఎవరైనా అడిగితే హోంసిక్ కారణంగానే పిల్లలను పంపినట్లు చెప్పేలా శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా జిల్లాలో చాలా కేజీబీవీల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడడ ం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మాయిలు ఉండే కేజీబీవీల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సంబంధించ ఎస్‌ఓను ఁసాక్షి* వివరణ...హోంసిక్ కారణంగా ఆ ఇద్దరు అమ్మాయిలనూ ఇంటికి పంపామని చెప్పారు.