రూ.12 కోట్ల ఎగవేతపై చర్యలేవీ! | ruling party leaders are done real estate danda | Sakshi
Sakshi News home page

రూ.12 కోట్ల ఎగవేతపై చర్యలేవీ!

Sep 29 2014 11:50 PM | Updated on Sep 2 2017 2:07 PM

అమలాపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లో రియల్ దందాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సాహసించలేకపోతోంది.

అమలాపురం టౌన్ : అమలాపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లో రియల్ దందాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సాహసించలేకపోతోంది. అక్రమ లే అవుట్లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన రియల్టర్లకు ఉన్న రాజకీయ అండదండల ముందు అధికారులు నిస్సహాయులవుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో 31 అక్రమ లే అవుట్లు ఉన్నట్టు, వాటి ద్వారా ప్రభుత్వానికి భూమి బదలాయింపు (కన్వర్షన్) ఫీజు కింద రూ.12 కోట్ల ఎగవేత జరిగిందని జిల్లా విజిలెన్‌‌స అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన పది మంది అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు.
 
పది నెలల కిందట అమలాపురంలో దాదాపు రూ.120 కోట్ల విలువ చేసే సుమారు 35 ఎకరాల్లో 31 అక్రమ లే అవుట్లు వేసి, రూ.12 కోట్ల కన్వర్షన్ ఫీజు ఎగవేసినట్లు విజిలెన్‌‌స నిర్ధారించింది. ఈ తప్పిదానికి అమలాపురం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులను బాధ్యులని తేల్చింది. అప్పటి మున్సిపల్ కమిషనర్, ఇద్దరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, అమలాపురం తహశీల్దారు, ఆరుగురు రెవెన్యూ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అప్పట్లో విజిలెన్‌‌స అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదిక పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రభుత్వానికి వెళ్లి పది నెలలు గడుస్తున్నా, దానిపై నేటికీ చర్యలు లేవు. అప్పట్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విజిలెన్‌‌స అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో ‘తాము రియల్టర్ల నుంచి ఎగవేసిన రూ.12 కోట్ల సొమ్ములు వసూలు చేస్తామని, లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
 
లే అవుట్ల ధ్వంసం ఒక్కపూటే..

విజిలెన్‌‌స నివేదికతో మున్సిపల్ అధికారుల్లో కొంత కదలిక వచ్చింది. ఫిబ్రవరి 11న అమలాపురంలోని అక్రమ లే అవుట్లను పొక్లెయిన్లతో ధ్వంసం చేసేందుకు ముహూర్తం పెట్టారు. మెషీన్లతో ఒక్కపూట ధ్వసం చేసి మిన్నుకున్నారు. మరో రెండు రోజుల్లో మళ్లీ లే అవుట్ల ధ్వంసం పనులు చేపడతామన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ చర్యలు చేపట్టలేదు. మళ్లీ దాని ఊసే ఎత్తడం లేదు. అసలు మున్సిపల్ కార్యాలయంలో అక్రమ లే అవుట్ల ఫైలు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో లే అవుట్ల ధ్వంసానికి మెషీన్లు కూడా రాకుండా రియల్టర్లు తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అప్పట్లో మున్సిపాలిటీకి మెషీన్లు అద్దెకు ఇచ్చేందుకు వాటి యజమానులు రియల్టర్లతో ఒత్తిడితో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు పొక్లెయిన్లు దొరకడంలేదన్న సాకుతో ఇక లే అవుట్లను ధ్వంసం చేయాలన్న విషయాన్నే విస్మరించారు. రెండు రోజుల్లో మళ్లీ చేపడతామన్న అధికారులు.. తొమ్మిది నెలలు కావస్తున్నా పట్టించుకోవడం లేదు.
 
అప్పుడూ, ఇప్పుడూ రాజకీయ పైరవీలే..
విజిలెన్‌‌స అధికారుల నివేదిక బుట్ట దాఖలయ్యేలా ఇక్కడి రియల్టర్లు చేసిన రాజకీయ ప్రయత్నాలు, పైరవీలు పనిచేశాయి. లే అవుట్లు ధ్వంసం చేస్తున్నప్పుడే రియల్టర్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని జిల్లాకు చెందిన ఓ మంత్రి అడ్డు వేసి వారికి అండగా నిలిచారు. అదే మంత్రి పార్టీ మారి.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ జిల్లాలో ఓ ప్రజాప్రతినిధిగా ఉండటంతో రియల్టర్లకు మళ్లీ అండ దొరికినట్టయింది. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేతో రియల్టర్లకు సత్సంబంధాలు ఉండడంతో అక్రమ లే అవుట్ల ధ్వంసం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. చివరకు అమలాపురంలో ప్రైవేటు సెటిల్మెంట్ బ్యాచ్ బెదిరింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న  ఓ రియల్టరు ఉదంతంలో కూడా తెరవెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బంధువులు, అనుచరులు ఉండడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement