రూ. 300 కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ | Rs. The restoration of the 300 current booking | Sakshi
Sakshi News home page

రూ. 300 కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ

Apr 4 2015 12:28 AM | Updated on Sep 2 2017 11:48 PM

రూ. 300 కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ

రూ. 300 కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ

శ్రీవారి దర్శనం కోసం రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్‌ను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

  • సీఎం చంద్రబాబు వెల్లడి
  • నగర అభివృద్ధి కోసం తిరుపతిలోనూ కౌంటర్లు
  • సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్‌ను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్ రద్దుతో శ్రీవారి దర్శనంలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘భక్తులకు కష్టం.. టీటీడీకి నష్టం’ శీర్షికతో  ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం ప్రత్యేకంగా విలేకరులతో మాట్లాడారు. తిరుమలకు వచ్చిన భక్తుడు కనీసం రెండు రోజులైనా  గడిపేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. తిరుమలకంటే తిరుపతిలోనే రూ. 300 టికెట్ల బుకింగ్ అవకాశం ఉంటే నగర అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే టీటీడీ అధికారులకు నిర్దేశాలిచ్చామన్నారు.
     
    టెంపుల్ కారిడార్ కోసం  నాలుగు లేన్ల రోడ్డు

    చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు, శ్రీకాళహస్తీశ్వరాలయం, వైఎస్‌ఆర్  జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం కేంద్రంగా టెంపుల్ కారిడార్ నెలకొల్పుతామని సీఎం తెలిపారు. ఒకే సమయంలో భక్తులు నాలుగు క్షేత్రాలను దర్శించుకునేలా సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు లేన్ల రింగురోడ్డు నిర్మిస్తామన్నారు. విభజన తర్వాత ఏర్పడిన కష్టాలను శ్రీవారి ఆశీస్సులతో అధిగమిస్తామన్నారు. ఒంటిమిట్టలో శ్రీకోందరామునికి పట్టువస్త్రాలు సమర్పించి అక్కడి నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పెప్సీ సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి వచ్చారని తెలిపారు.
     
    శ్రీవారి సేవలో చంద్రబాబు, పెప్సీకో సీఈవో

    ముఖ్యమంత్రి చంద్రబాబు, పెప్పీకో సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి తమ బృందంతో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు.అనంతరం వకుళమాతను దర్శించుకుని, హండీలో కానుకలు సమర్పించారు.
     
    శ్రీవారి ఆశీస్సులతోనే కొత్త ప్రాజెక్టు మొదలెడతాం: నూయి

    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తాము కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటామని పెప్సీకో సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి తెలిపారు. శ్రీసిటిలో కొత్త ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలసి తిరుమలేశుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేరొన్నారు. ఏపీలో మరికొన్ని ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సహకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement