breaking news
Current booking
-
తత్కాల్ టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే కన్ఫర్మ్ సీటు!
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేకపోయినా రైలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ప్రయాణికులు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం భారతీయ రైల్వే కల్పిస్తోంది. ఐఆర్సీటీసీలోని ‘Charts Vacancy’ ఫీచర్ ద్వారా ఈ సీట్ల వివరాలను తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకుంటే నేరుగా కన్ఫర్మ్ టికెట్ జారీ అవుతుంది.చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీ సీట్లురైలు బయలుదేరే ముందు తొలి రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేసినప్పుడు కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైలు బయలుదేరడానికి సుమారు నాలుగు గంటల ముందు తొలి చార్ట్ తయారవుతుంది. ఆ తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లను ‘కరెంట్ బుకింగ్’ ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైలు, మార్గాన్ని బట్టి బుకింగ్ సమయం మారవచ్చు.కరెంట్ బుకింగ్‌లో లభించే టికెట్లు వెయిట్‌లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్లు కావు. ఖాళీ సీటు అందుబాటులో ఉంటే బుక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ టికెట్ (CNF) జారీ అవుతుంది. దీంతో తత్కాల్ టికెట్ దొరకని ప్రయాణికులకు ఇది మరో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.తత్కాల్ ఛార్జీలు ఉండవుకరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకునే ప్రయాణికులు అదనంగా తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ సర్‌ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణ రిజర్వేషన్ ఛార్జీలే వర్తిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఖాళీ సీట్లను ఆకర్షణీయంగా బుక్ చేసుకునేలా డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండొచ్చు. డిస్కౌంట్ వర్తింపు రైలు, సీటు, బుకింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.రీఫండ్ విషయంలో జాగ్రత్తకరెంట్ బుకింగ్ టికెట్లను బుక్ చేసుకునే ముందు ప్రయాణ ప్రణాళికను ఖరారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టికెట్లను రద్దు చేసినప్పుడు సాధారణంగా రీఫండ్ నిబంధనలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి చివరి నిమిషంలో సీటు దొరికిందని తొందరపడి బుక్ చేసుకునే ముందు క్యాన్సిలేషన్ నిబంధనలను పరిశీలించాలి.ఐఆర్సీటీసీలో ఖాళీ సీట్లు ఎలా చూడాలి?ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి రైలు బుకింగ్ విభాగంలో ‘Charts/Vacancy’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ వంటి వివరాలను నమోదు చేస్తే చార్ట్ సిద్ధమైన తర్వాత అందుబాటులో ఉన్న కోచ్‌లు, బెర్త్‌ల వివరాలను చూడవచ్చు. ఖాళీ సీటు కనిపిస్తే, నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.ఇంటర్మీడియట్ స్టేషన్లో ప్రయాణికుడు దిగిపోయిన తర్వాత ఖాళీ అయిన బెర్త్‌లు కూడా తదుపరి స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఖాళీ సీట్ల కోసం ప్రయాణికులు రైలులో టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు చార్ట్ వేకెన్సీ ద్వారా అందుబాటులో ఉన్న వివరాలను ఆన్లైన్లోనే చూసుకునే అవకాశం ఉంది.అందువల్ల తత్కాల్ బుకింగ్‌లో టికెట్ దొరకని ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు ‘Charts/Vacancy’ను ఒకసారి పరిశీలిస్తే, అదృష్టం కలిసొస్తే నేరుగా కన్ఫర్మ్ సీటును పొందే అవకాశం ఉంటుంది. -
తిరుమలలో కరెంట్ బుకింగ్
తిరుమల: తిరుమలలో అద్దె గదులకు కరెంట్ బుకింగ్ చేసుకునే భక్తుల నుంచి కాషన్ డిపాజిట్ తీసుకునే విధానాన్ని టీటీడీ గురువారం ప్రారంభించింది. తిరుమలలోని 17 ఉప విచారణ కేంద్రాల్లో భక్తులకు గది తాళం ఇచ్చే సమయంలో కాషన్ డిపాజిట్ తీసుకుని గదిని ఖాళీ చేసే సమయంలో రిఫండ్ కేంద్రాల ద్వారా తిరిగి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కరెంట్ బుకింగ్ రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె గదులు పొందిన భక్తుల నుంచి రూ.500 కాషన్ డిపాజిట్ వసూలు చేస్తుండగా, రూ.501 నుంచి రూ.1000 వరకు, రూ.1001 నుంచి రూ.6,000 వరకు అద్దె ఉన్న గదులకు అంతే మొత్తంలో కాషన్ డిపాజిట్ తోపాటు, జీఎస్టీని భక్తుల నుంచి తీసుకుంటున్నారు. గదులను ఖాళీ చేసిన సమయంలో కాషన్ డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు గతంలోనే ఏర్పాటు చేసిన రిఫండ్ కౌంటర్లను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ కాషన్ డిపాజిట్ వివరాలను ప్రదర్శిస్తున్నారు. -
రూ. 300 కరెంట్ బుకింగ్ పునరుద్ధరణ
సీఎం చంద్రబాబు వెల్లడి నగర అభివృద్ధి కోసం తిరుపతిలోనూ కౌంటర్లు సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్‌ను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 300 టికెట్ల కరెంట్ బుకింగ్ రద్దుతో శ్రీవారి దర్శనంలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘భక్తులకు కష్టం.. టీటీడీకి నష్టం’ శీర్షికతో ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం ప్రత్యేకంగా విలేకరులతో మాట్లాడారు. తిరుమలకు వచ్చిన భక్తుడు కనీసం రెండు రోజులైనా గడిపేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. తిరుమలకంటే తిరుపతిలోనే రూ. 300 టికెట్ల బుకింగ్ అవకాశం ఉంటే నగర అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే టీటీడీ అధికారులకు నిర్దేశాలిచ్చామన్నారు. టెంపుల్ కారిడార్ కోసం నాలుగు లేన్ల రోడ్డు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు, శ్రీకాళహస్తీశ్వరాలయం, వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం కేంద్రంగా టెంపుల్ కారిడార్ నెలకొల్పుతామని సీఎం తెలిపారు. ఒకే సమయంలో భక్తులు నాలుగు క్షేత్రాలను దర్శించుకునేలా సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు లేన్ల రింగురోడ్డు నిర్మిస్తామన్నారు. విభజన తర్వాత ఏర్పడిన కష్టాలను శ్రీవారి ఆశీస్సులతో అధిగమిస్తామన్నారు. ఒంటిమిట్టలో శ్రీకోందరామునికి పట్టువస్త్రాలు సమర్పించి అక్కడి నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పెప్సీ సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి వచ్చారని తెలిపారు. శ్రీవారి సేవలో చంద్రబాబు, పెప్సీకో సీఈవో ముఖ్యమంత్రి చంద్రబాబు, పెప్పీకో సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి తమ బృందంతో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు.అనంతరం వకుళమాతను దర్శించుకుని, హండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారి ఆశీస్సులతోనే కొత్త ప్రాజెక్టు మొదలెడతాం: నూయి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తాము కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటామని పెప్సీకో సీఈవో ఇంద్రా కృష్ణమూర్తి నూయి తెలిపారు. శ్రీసిటిలో కొత్త ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలసి తిరుమలేశుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేరొన్నారు. ఏపీలో మరికొన్ని ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సహకరిస్తామన్నారు.


