నెలకు రూ.10 వేల వేతనం 

Rs 10 thousand salary per month to Velugu Animators says YS Jagan - Sakshi

సంఘమిత్ర, వీవోఏ, వెలుగు యానిమేటర్స్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటన 

మీరు బాగుంటేనే అక్కచెల్లెమ్మలందరూ బాగుంటారు 

అందరూ సంతోషంగా ఉంటేనే పొదుపు సంఘాలు బతుకుతాయి 

చంద్రబాబు సీఎం అయ్యాక రూ.14,204 కోట్ల ఔట్‌ స్టాండింగ్‌ అప్పు  

అప్పులు మాఫీ చెయ్యకపోవడంతో ఇప్పుడు 20,600 కోట్లు అయింది 

ఈ వ్యవస్థను బతికించడానికి మీ అప్పు సొమ్ము 4 విడతల్లో మీ చేతికే ఇస్తాం 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అక్కచెల్లెమ్మలు సంతోషంగా లేకపోతే పొదుపు సంఘాలు సరిగా ఉండవు. మీరు (సంఘమిత్ర, వీవోఏ, వెలుగు యానిమేటర్స్‌) సంతోషంగా ఉంటేనే పొదుపు సంఘాలు బావుంటాయి. పొదుపు సంఘాలుంటేనే మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడతారు. కాబట్టి మన ప్రభుత్వం రాగానే మీకు నెలకు రూ.10 వేల వేతనం ఇచ్చి ఈ వ్యవస్థను మళ్లీ పునరుజ్జీవింపచేస్తాం’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

ఎన్నో ఏళ్లుగా తాము కష్టపడి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, తమను అసలు గుర్తించడం లేదని వీవోఏ (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)లు, సంఘమిత్రలు, వెలుగు యానిమేటర్స్‌ ఆదివారం వైఎస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలు ఏకరువుపెట్టారు. భారీ వర్షం కారణంగా పాదయాత్ర సాగక పోవడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడలో విడిది చేసిన శిబిరం వద్ద వారు జననేతను కలిసి తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను వివరించారు. అధికారంలోకి రాగానే తమకు నెలనెలా వేతనమిచ్చి ఆదుకోవాలని కోరారు. గతంలో నెలకు రూ.2 వేలు ఇచ్చి ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావించారని, ఆయన మరణంతో ఆ ఫైలును తొక్కిపెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలు ఓపికగా విన్న జగన్‌.. వారికి ధైర్యం చెబుతూ తాము అండగా ఉంటామన్నారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

డ్వాక్రా వ్యవస్థకు మూలాలు మీరే 
‘‘మీరు బాగోలేకపోతే డ్వాక్రా వ్యవస్థే నాశనమవుతుంది. ప్రతి మహిళా మీటింగ్‌లో ఈ విషయం చెబుతూనే ఉన్నాం. అందుకే మనం అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలన్నింటినీ పటిష్టం చేస్తాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ.14,204 కోట్ల ఔట్‌ స్టాండింగ్‌ అప్పు ఉండేది. ఈయన మాఫీ చేస్తాను అని చెయ్యక పోవడం వల్ల ఈ రోజు అది రూ. 20,600 కోట్లకు చేరుకుంది. అంటే నాలుగేళ్లలో రూ.6 వేల కోట్లకు పైగా పెరిగింది. మాఫీ అవుతుందని మీరు కట్టకపోవడం వల్ల వడ్డీ మీద వడ్డీ పడి అప్పు పెరిగిపోయింది. తాజాగా ఎస్‌ఎల్‌బీసీ ఇచ్చిన రిపోర్టులో ఈ వివరాలు ఉన్నాయి. ఇంత అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ వ్యవస్థ మళ్లీ బాగుపడాలంటే? మనం కొన్ని పనులు చేయాలి. అందుకే మనం అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సంబంధించి మొత్తం రుణం ఎంత ఉందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా  మీచేతికి నగదుగా అందజేస్తాం.

ఈ డబ్బుతో మీరు ఏం చేసుకుంటారో మీ యిష్టం. 2016 అక్టోబర్‌ తర్వాత ప్రభుత్వం పొదుపు సంఘాల అప్పులకు సంబంధించిన వడ్డీ డబ్బులు కట్టడం మానేసింది. రైతుల అప్పులకు అయితే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వడ్డీ డబ్బులు కట్టడం మానేసింది. మనం అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల వడ్డీ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. దీంతో అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారు. బ్యాంకులతో సంబంధాలు పెరుగుతాయి. వడ్డీల భారం నెత్తిన పడకుండా ఉంటుంది. దీనివల్ల పొదుపు సంఘాల వ్యవస్థ అనేది బతుకుతుంది. ఈ వ్యవస్థ నిర్వీర్యమైతే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అందుకే ఈ పొదుపు సంఘాల వ్యవస్థ బతకాలి.

ఇందుకు మీరు ముందుండి వ్యవస్థను నడిపించాలి. ప్రతి 20 గ్రూపులకు, ప్రతి 30 గ్రూపులకు ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి కదా.. బ్యాంకులకు సంఘాల సభ్యురాళ్లకు మీరు సమన్వయకర్తలుగా ఉన్నారు కాబట్టే ఈ వ్యవస్థ బతుకుతుంది. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాలు చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పాను. ఇప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా జీతం రావడం లేదు. మనం అధికారంలోకి రాగానే కనీసం నెలకు రూ.10 వేలు పైనే వేతనం ఇస్తాం. అంతేకాదు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఎవరైనా రూ.10 వేల కంటే తక్కువకు పనిచేస్తుంటే వాళ్లందరికీ నెలకు రూ.10 వేలు పైనే వేతనం ఇస్తాం. ఈ మాత్రం వేతనం లేకపోతే ఏరకంగా మీరు సంతోషంగా బతకగలరు? మీరు రూ.5 వేలు ఇవ్వాలని వినతిపత్రంలో ఇచ్చారు. కానీ అది సరిపోదు కాబట్టి రూ.10 వేలు పైనే ఇస్తాం. ఈ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి మిమ్మల్నందర్నీ బాగా చూసుకునే బాధ్యత మాది.  

డ్వాక్రా సంఘాలను ఏం చేద్దామనుకున్నారు? 
ఉన్న సంఘమిత్రలను ఊడ్చేసి వాళ్ల స్థానంలో సాధికార మిత్రలంటూ తెరమీదకు తెచ్చి, ప్రభుత్వం జీతాలు ఇచ్చి పని చేయిస్తోంది. అసలు ప్రభుత్వం చేయాల్సిన పనేంటి? ప్రభుత్వం మహిళలను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ బూత్‌ కమిటీ మెంబర్లను తెచ్చి.. ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీకి ఓటెయ్యండి అని చెప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు లోన్లు ఇప్పించేదెవరు? బ్యాంకుల చుట్టూ తిరిగేదెవరు? బ్యాంకులకు – మహిళలకు మధ్య సమన్వయకర్తలుగా ఉండాల్సింది ఎవరు? మహిళా (డ్వాక్రా) సంఘాలను ఏం చేద్దామనుకున్నారు?’’ అని జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ భరోసా చాలు 
చాలా ఏళ్లుగా యానిమేటర్లుగా పనిచేస్తున్నాం. అధికారంలోకి రాగానే కనీస వేతనం ఇచ్చేలా చూడాలని జగన్‌మోహన్‌రెడ్డి గారిని కోరాం. ఆయన నెలకు పది వేల రూపాయల వేతనం ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ భరోసా ఉంటే యానిమేటర్లు అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.   
 – మణి, ఆత్రేయపురం 
 
వర్కర్‌గా గుర్తించడం అదృష్టంగా భావిస్తున్నాం 
జగన్‌ గారి ప్రకటన మాకు సంతోషాన్నిచ్చింది. నాలుగు దఫాలుగా రుణ మొత్తం మహిళల చేతికే ఇస్తామనడం ఆనందంగా ఉంది. మమ్మల్ని ముందుగా వర్కర్‌గా గుర్తించడం మా అదృష్టం. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. ఆ తర్వాత ఆ ఫైలును తొక్కి పెట్టారు. ఇప్పుడు జగన్‌ గారి ప్రకటనను స్వాగతిస్తున్నాం.   
 – గంగా భవాని, కాకినాడ రూరల్‌ 

ఏళ్లతరబడి కష్టపడుతున్నా గుర్తించలేదు 
చాలా ఏళ్ల నుంచి డ్వాక్రా వ్యవస్థలో యానిమేటర్‌గా కష్టపడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్‌ గారు నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. అలాంటి ప్రభుత్వాలకు మేము శాయశక్తులా కష్టపడి పనిచేస్తాం. 
    – టి.లక్ష్మి, రాయుడు పాలెం 
 
పొదుపు సంఘాలకు శుభవార్త 
జగన్‌ గారు.. యానిమేటర్లు, సంఘమిత్రలు వీవోఏలుగా పని చేస్తున్న అందరికీ నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని ప్రకటించడం పొదుపు సంఘాలకు శుభవార్త. పదివేల రూపాయలు లేనిదే ఎవరూ సంతోషంగా ఉండలేరనే విషయాన్ని ఆయన గుర్తించడం మంచి పరిణామం. నిజంగా ఈ రోజు మంచి రోజు.
    – ఈశ్వరి, పెదపూడి 

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం 
ఏపీఎస్‌ఆర్‌టీసీ, విద్య, విద్యుత్‌ శాఖలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల్లో వీలైనంత ఎక్కువ మందిని వారి అర్హత, సర్వీసులను బట్టి రెగ్యులరైజ్‌ చేస్తామని, అది తమ విధానమని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు ఆదివారం జగన్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వోద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తానని జగన్‌ ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా వారు చేసిన సూచనలకు జగన్‌ స్పందిస్తూ.. ఈ మూడు శాఖల్లోనే ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్‌ ఎక్కువగా ఉందని, అందుకే వారి సర్వీసు, విద్యార్హతలను బట్టి వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని భరోసా ఇచ్చారు. ‘ఎలా చేద్దాం అనేది మీకే అప్పగిస్తాను. పారదర్శకంగా ఒక విధానం తీసుకు రండి’ అని జగన్‌ అన్నారు. విద్యార్హతలున్న వారెవ్వరినీ దూరంగా పెట్టాల్సిన పనే లేదనేది తన అభిప్రాయమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ రికార్డులన్నింటినీ తాము అధికారంలోకి రాగానే పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షం వారు భూమిని ఇష్టమొచ్చినట్లుగా దోచేస్తున్నారు. రికార్డులను మార్చేసి వాళ్లకు సంబంధించిన వారి పేర్లతో రాయించుకుంటున్నారు. ప్రతి చోటా ఇదే సమస్య. దీనివల్ల అసైన్డ్‌ భూములు గల వారు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తాం’ అన్నారు.  

ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయం పరిశీలిస్తాం 
ప్రభుత్వోద్యోగులు అనారోగ్యం పాలైనప్పుడు ప్రస్తుత విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని వారు జగన్‌ దృష్టికి తెచ్చారు. ‘మీ వద్ద నుంచి ఓవైపు డబ్బు వసూలు చేస్తున్నారు కానీ, క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వకుండా ఎగవేస్తున్నారు. అందుకే మీకు ఏ పద్ధతి అయితే బాగుంటుందో పరిశీలిద్దాం. మిమ్మల్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చేందుకు కూడా ప్రయత్నిస్తాం. నాలుగు లక్షల మంది ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రావడం వల్ల ఆ పథకం ఇంకా పటిష్టంగా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా తరిగేది కూడా ఏమీ ఉండదు’ అని జగన్‌ అభిప్రాయపడ్డారు. నీటి తీరువాను రద్దు చేయాలని కొందరు వీఆర్వోలు కోరినప్పుడు ‘ఈ మధ్య నీటి తీరువాను మళ్లీ పెంచినట్లున్నారే.. మీరు చేసింది చాలా విలువైన సూచన.. రైతుల నీటి తీరువా బకాయిలు ఎంత మొత్తంలో ఉన్నాయో పరిశీలిస్తాం.. రైతులకు మేలు జరుగుతుందని అంటే రద్దు విషయం కూడా ఆలోచిస్తాం.

వాస్తవానికి ఈ తీరువాతో వచ్చిన డబ్బును కాలువల బాగు కోసం ఖర్చు చేస్తే సమస్యలు ఉండవు. కానీ ఈ డబ్బును ఎపుడూ ఇలా ఖర్చు పెట్టరు’ అన్నారు. తమను సీపీఎస్‌ పరిధి నుంచి మినహాయించి పదవీ విరమణానంతర పింఛన్లు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా వీఆర్వోల అసోసియేషన్‌ నేతలు జగన్‌కు వినతిపత్రం ఇవ్వగా.. పరిశీలిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలం లేని పింఛనుదారులకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయిస్తామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, వీఆర్వోల జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు సబ్బిళ్ల సాయిరెడ్డి, జిల్లా ప్రభుత్వోద్యోగుల డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, ఇతర నేతలు అనిల్‌ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top