బ్లేడ్‌ బ్యాచ్‌ ఎఫెక్ట్‌... రౌడీ షీటర్‌ హత్య

Rowdy Sheeter murdered In Rajamahendravaram - Sakshi

రాజమహేంద్రవరం క్రైం: బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా తగాదాలలో మరో రౌడీ షీటర్‌ హత్యకు గురయ్యాడు. కంబాలపేటకు చెందిన చల్లా భరత్‌ (25) అనే రౌడీ షీటర్‌ను ప్రత్యర్థులు బుధవారం పథకం ప్రకారం హత్య చేశారు. రెండు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చోడేశ్వరనగర్‌లోని చింతతోపులో భరత్‌ మద్యం సేవిస్తున్నట్లు భరత్‌ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న వీరభద్రనగర్‌కు చెందిన గంజాయి వ్యాపారి రింగ్‌(అలియాస్‌ రెడ్డి దుర్గ), బాలాజీపేటకు చెందిన పెద్దజగ్గ (అలియాస్‌ అల్లం జగదీష్‌), తాడితోటకు చెందిన సూరి (అలియాస్‌ బూరా సురేష్‌) మోటారు సైకిల్‌పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవించేందుకు సిద్ధమవుతున్న భరత్‌ను ముందుగా సర్వే కర్రతో తలపై బలంగా కొట్టడంతో తల పగిలిపోయింది. దీనితో పక్కకు పడిపోయిన భరత్‌ను నిందితులు వెంట తెచ్చుకున్న బటన్‌ నైఫ్‌తో గుండెల్లో పొడిచి హత్య చేశారు. కొన ఊపిరితో ఉన్న భరత్‌ను అతని స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్‌ కుమార్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. 

ఎలా జరిగిందంటే...
రెండు నెలల క్రితం చంపేస్తామని ప్రత్యర్థి వర్గం భరత్‌ ఇంటికి వచ్చి గోడవ చేశారు. భరత్‌ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే భరత్‌ తమ్ముడు శరత్‌ మృతి చెంది బుధవారానికి మూడు నెలలు కావడంతో కుటుంబ సభ్యులతో కలసి రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్‌లోని చిన ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉదయం పూజలు చేసి 8 గంటల సమయంలో తల్లి, భార్యను ఇంటికి పంపేశాడు. తన స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్‌ తదితరులతో కలసి మద్యం సేవించేందుకు చోడేశ్వరనగర్‌లోని చింతతోపు వద్ద కూర్చొని తన ఇద్దరు స్నేహితులను మద్యం తీసుకువచ్చేందుకు పంపించా డు. అయితే స్నేహితుల ద్వారా భరత్‌ చోడేశ్వరనగర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రత్యర్థులు మోటారుసైకిల్‌ పై వచ్చి సర్వే కర్ర, చాకులతో హత్య చేశారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి, డీఎస్పీలు జె.కులశేఖర్, యు.నాగరాజు, త్రీటౌన్‌ సీఐ శేఖర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మృతుడిపై పైలు కేసులు
మృతుడి పై త్రీటౌన్, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠాలుగా ఏర్పడి అమాయకులను టార్గెట్‌ చేసుకొని వారిపై దాడులు చేసి నగదు చోరీ చేయడం, మద్యం షాపులలో గొడవలు పడడం వంటి నేరాలలో మృతుడు భరత్‌పై కేసులు ఉన్నాయి. దీనితో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీట్‌ తెరిచారు. మృతుడి తమ్ముడు చల్లా శరత్‌ గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్న తరువాత కొంత వరకూ గొడవలు తగ్గించుకున్నప్పటికీ పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం భరత్‌ను హత్య చేసేందుకు అతని ఇంటి చుట్టూ తిరిగే వారు.  

బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా ఆధిపత్య పోరు
రాజమహేంద్రవరం నగరంలో రెండు బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠాలు ఆధిపత్య పోరులో హత్యల పరంపర కొనసాగుతోంది. గతంలో రాజేంద్రనగర్‌కు చెందిన ధనాల దుర్గారావు అనే ఆటో డ్రైవర్‌ను బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా సభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా పేపర్‌ మిల్లు వద్ద గల పెట్రోల్‌ బంక్‌ వెనుక శివ అనే యువకుడిని హత్య చేశారు. అప్పటి నుంచి నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆధిపత్య పోరు కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న దారా మహేష్, ఉప్పు శివ, తదితరులకు ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లేడ్‌ బ్యాచ్‌లకు చెందిన ఇరువర్గాల వారికి రాజకీయ ప్రాబల్యం ఉండడంతో పోలీసులు వీరిని వివిధ కేసులలో అరెస్ట్‌ చేసి జైల్‌కు పంపించినప్పటికీ బెయిల్‌ పై బయటకు వచ్చేస్తున్నారు. దీంతో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు నగరంలో పెచ్చుమీరుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తే తప్ప వీరి ఆగడాలకు అడ్డుకట్టపడదు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top