రోకలిబండతో మోది భార్య హత్య | Rokalibandato modi wife's murder | Sakshi
Sakshi News home page

రోకలిబండతో మోది భార్య హత్య

Oct 14 2014 12:06 AM | Updated on Jul 30 2018 8:29 PM

రోకలిబండతో మోది భార్య హత్య - Sakshi

రోకలిబండతో మోది భార్య హత్య

పెదకాకాని అనుమానం పెనుభూతమైంది. కసిపెంచుకున్న భర్త నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో మోది కిరాతకంగా హతమార్చిన ఘటన...

పెదకాకాని
 అనుమానం పెనుభూతమైంది. కసిపెంచుకున్న భర్త నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో మోది కిరాతకంగా హతమార్చిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రం పెదకాకానిలోని అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో పల్లె ఉలిక్కిపడింది. ఏంజరిగిందో తెలుసుకునేసరికే మంచంపై రక్తపుమడుగులో పిచ్చమ్మ(50) శాశ్వత నిద్రలోకి జారుకోగా.. ఆమె భర్త నిరంతరావు ‘నేనే చంపానంటూ’ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌నగర్‌లో మాతంగి నిరంతరావు, పిచ్చమ్మ అలియాస్ సౌభాగ్యమ్మ దంపతులు నివశిస్తున్నారు. నిరంతరావు ఆటోనగర్‌లో బల్ల రిక్షా బాడుగకు తిప్పుతుండగా, పిచ్చమ్మ కూలి పనులకు వెళుతుంది. వారికి ఇద్దరు కుమారులు మరియదాసు, నరసింహారావు, ఇద్దరు కుమార్తెలు చంద్రమ్మ, మరియమ్మ ఉన్నారు.

నలుగురికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారు స్థానికంగానే నివాసం ఉంటున్నారు. మరియమ్మకు భర్త చనిపోవడంతో ఇద్దరు సంతానంతో తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిమందు పూరింట్లో ఓ భాగంలో నివసిస్తోంది. మరియదాసు కుటుంబం మరోభాగంలో ఉంటోంది. నిరంతరావు ఈ మధ్యకాలంలో తన భార్య పిచ్చమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో భార్య నిద్రలో ఉండగా.. అర్ధరాత్రి భర్త నిరంతరావు రోకలిబండ తీసుకుని తలపై గట్టిగా మోదడంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది.

అదే ఇంట్లో నిద్రిస్తున్న మనవడు ప్రశాంత్ భయంతో ఎదురుగా పూరింట్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు పరుగుతీశాడు. వారు వచ్చి చూసేసరికి మంచంపై పిచ్చమ్మ రక్తపు మడుగులో మృతిచెంది ఉంది. అప్పుడే బయటకు వెళ్లిన నిరంతరావు నేరుగా పెదకాకాని పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. తన భార్యను చంపానంటూ లొంగిపోయాడు.

సోమవారం ఉదయం గుంటూరు అర్బన్ జిల్లా నార్త్ జోన్ (మంగళగిరి) డీఎస్పీ ఎం.మధుసూదనరావు, సీఐ కొకా శ్రీనివాసరావు సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement