ఉపాధి పేరుతో స్వాహా!

Robbery In The Name Of Employment - Sakshi

పిఠాపురం: ఎప్పుడూ కూలికి వెళ్లని గృహిణి పేరున వేల రూపాయలు బ్యాంకు అక్కౌంటులో జమవుతున్నాయి ... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా పనులు చేయకుండానే ఉపాధి కూలీలుగా రికార్డుల్లో నమోదవుతూ బ్యాంకు అకౌంట్లలో వేలకువేల రూపాయలు జమవుతున్నాయి. జాబ్‌ కార్డు ఉండి కూడా సంవత్సరాల తరబడి పని లేక అధికారుల చుట్టూ తిరుగుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నా వారికి పని కల్పించడం లేదు. పని చేసి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మరెందరో రోదన. స్నేహాన్ని బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కావల్సిన వారికి జాబ్‌ కార్డులు ఇప్పించి వారి పేరున రూ.కోటికిపైగా దోపిడీ చేసినా ఆ విషయం సామాజిక తనిఖీల్లో బయటపడినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు.

బహిరంగంగా అవినీతికి పాల్పడినా అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడం... ఏ ఒక్క అధికారీ చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుండడంతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరిలో అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో ఇలా అక్రమాలు చోటుచేసుకున్నా తనిఖీలకు వచ్చిన కేంద్ర బృందానికి మాత్రం అధికారులు అరచేతిలో స్వర్గం చూపించారు. బాగా చేసిన పనుల వద్దకు తీసుకువెళ్లి చూపించి అహో అనిపించారన్న విమర్శలున్నాయి. సామాజిక తనిఖీలలోనూ మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు లేకపోలేదు.

ఇదిగో అవినీతి : కొత్తపల్లి మండలం కొమరగిరిలో 1139 జాబ్‌ కార్డులున్నాయి. ఈ ఏడాది 366 పనులు నిర్వహించగా రూ.1,07,17, 157 గ్రూపులకు చెందిన 1806 మంది కూలీలకు 37,255 పని దినాలు కల్పించినట్టు రికార్డుల్లో రాసి వేతనాలుగా చెల్లించారు.
∙సన్నిబోయిన కృష్ణ కుమార్‌. ఈయన ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. కానీ ఇతని పేరున ఉపాధి కూలీ జాబ్‌ కార్డు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన పేరున బ్యాంకు అక్కౌంటు నంబరు 32500283855 (ఎస్‌బీఐ కొమరగిరి)లో ఉపాధి కూలీగా సుమారు రూ.30 వేల సొమ్ము జమయింది. 
∙కొమరగిరి శివారు ఆనందనగరానికి చెందిన బర్రె శిరీష. ఈమె వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తోంది. ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 33541674172 ఎస్‌బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ. 25 వేలు జమ చేశారు. 
∙పిఠాపురంలోని ఓ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న సాకా ప్రేమ సూర్యావతికి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 31942977225 ఎస్‌బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.40 వేలు జమ చేశారు. ఎప్పుడు కూలికి వెళ్లని గృహిణి కె.ఝాన్సీరాణి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 20128460793 ఎస్‌బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.20 వేలు జమ చేశారు. 
∙గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న నక్కా లోవ ప్రసాద్‌ ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆయన అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 3273997893 ఎస్‌బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు సుమారు రూ.15 వేలు జమ చేశారు. ఇవి కొన్ని మాత్రమే ఇలాంటివి కొమరగిరిలో కోకొల్లలు. ఎవరి పేరున జాబ్‌కార్డు ఉందో ఎంతమందికి ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉపాధి పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జాబ్‌ కార్డుల్లోనూ మాయాజాలం...
కొందరు ఉద్యోగులు, ఆటో వాలాలు, గృహిణులు తదితరుల పేరున జాబ్‌కార్డులు సృష్టించి వారి ఖాతాలకు ఉపాధి నిధులు మళ్లించి వాటిని ఆయా కార్డు హోల్డర్ల ద్వారానే నిధులు డ్రా చేయించి స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉపాధి హామీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో తమకు నమ్మకమైన వ్యక్తులు బంధువులు, స్నేహితులకు జాబ్‌కార్డులు ఇప్పిస్తున్నారు. వారి ఖాతాలకు ఉపాధి పని చేసినట్లుగా కూలీ డబ్బులు వేయించి వారి సహకారంతో డ్రా చేసుకుంటున్నట్లు ఒక ఆటో డ్రైవరు ఉన్నతాధికారుల సమక్షంలో నిజాలను బయటపెట్టినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో సంబంధితాధికారులు నోరు మెదపడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top