ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు.. | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..

Published Sat, Oct 21 2017 6:22 AM

road construction pending gandikota diversion - Sakshi

ముద్దనూరు/కొండాపురం :  గండికోట రిజర్వాయరు నిర్మాణంలో భాగంగా ముద్దనూరు, కొండాపురం మండలాల్లో మొత్తం 22 గ్రామాలతో పాటు,సుమారు 30 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి ముంపునకు గురవుతోంది. ముద్దనూరు మండలంలోని కమ్మవారిపల్లె సమీపం నుంచి కొండాపురం మండలంలోని సుగుమంచిపల్లె వరకు పాత రహదారి ముంపునకు గురవుతుండడంతో దీనికి ప్రత్యమ్నాయంగా దాదాపు 9 ఏళ్ల క్రితమే డైవర్షన్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి.ముఖ్యమంత్రులు మారడం, పాత టెండర్లను రద్దుచేయడం, కొత్త టెండర్లలో అంచనాలు పెరగడం తప్ప రహదారి నిర్మాణం మత్రం పూర్తికాలేదు.

రూ. 40 నుంచిరూ.100కోట్లకు చేరిన రోడ్డు నిర్మాణ వ్యయం
అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి అనుమతి లభించింది.వైఎస్సార్‌ మరణానంతరం పనులు నిలిచిపోయాయి..మరో రెండు మార్లు టెండర్ల ప్రక్రియ వరకు వచ్చి  ఆగిపోయింది.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సుమారు రూ.100 కోట్ల పైచిలుకు వ్యయంతో  రహదారి నిర్మాణం మొదలుపెట్టారు.అధికార పార్టీ అనుయాయులకే  పనులు దక్కాయి. రహదారి నిర్మాణ వ్యయం రెట్టింపయినప్పటికీ,ఇప్పటికే  రెండు మార్లు గడువు పెంచారు.

గండికోటలోకి నీరొస్తే అవస్థలే:
గండికోట ప్రాజెక్టులో సుమారు 5 టీఎంసీల నీరు నిల్వ చేస్తే ప్రస్తుతం ఉన్న కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో వాహనాలను ముద్దనూరు నుంచి మరో మార్గం ద్వారా మళ్లించాల్సిందే.గత ఏడాది కూడా ప్రాజెక్టులో నీరు చేరడంతో వాహనాలను మళ్లించారు.అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 4 టీఎంసీలు చేరగానే  కొండాపురానికి సమీపంలోని చిత్రావతి బ్రిడ్జికి నీరు చేరువకావడంతో పాటు వంతెన కూడా ప్రమాదకరంగా తయారైంది.ఈ నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా  ముద్దనూరు నుంచి తాడిపత్రి, అనంతపురం పట్టణాలకు వెళ్లే వాహనాలను జమ్మలమడుగు,మల్లేల మీదుగా తిప్పుతున్నారు. దీనివల్ల కొండాపురం మండల ప్రజలు ప్రయాణానికి తవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం, గంగాపురం, చౌటిపల్లె పల్లె గ్రామాల ప్రజలు వ్యవప్రయాసలకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా మళ్లీ రహదారి నిర్మాణానికి మరోమారు గడువు పెంపు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.ఈ మార్గంలో ఇప్పటికే సుమారు 90 శాతం మేర కల్వర్టుల నిర్మాణం పూర్తయినట్లు, రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి పూర్తయితే రహదారిని త్వరగా నిర్మిస్తామని జీఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ మధుసూధన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement