విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఇంటికే

rjd prathap reddy fired on education department officials

సిబ్బందిని హెచ్చరించిన ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి

ఐదుగురు ఎంఈఓలకు మెమోలు

అనంతపురం రూరల్‌: ‘ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా సిద్ధం చేయాలని గత నెలలో చెప్పా? జాబితా తయారు చేశారా? అసలు పదోన్నతకి అర్హులైన ఉపాధ్యాయులు  ఎంత మంది జిల్లాలో ఉన్నారో గుర్తించారా? విధులంటే అంత నిర్లక్ష్యమా ఇలాగే కొనసాగితే షోకాజ్‌ నోటీసులు ఉండవు.. ఇంటికి పంపుతా’ అని ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి విద్యాశాఖ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయ పదోన్నతుల జాబితాలు తయారు చేసి పంపారన్నారు.

అనంతపురం జిల్లాలో పదోన్నతలకు అర్హులైన ఉపాధ్యాయుల లేరా అని ప్రశ్నించారు. కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తన మార్చుకోకపోతే విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లపై చర్యలు తీసుకుంటానన్నారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ జిల్లా ఎలా ఉంది? ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? 11, 12వ స్థానంలో ఉంది. మానిటరింగ్‌ విధానం సక్రమంగా లేదన్నారు. నోడల్‌ టీం సభ్యులను కొత్తవారిని కేటాయించాలని సూచించారు. స్వచ్ఛ విద్యాలయాల దిశగా ప్రతి పాఠశాలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఐదుగురికి మెమోలు
జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తలుపుల, తాడిపత్రి, తనకల్లు, మదిగుబ్బ, రోళ్ల ఎంఈఓలకు మెమోలను జారీ చేయాలని ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఈ ఐదు మండలాల్లో గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ 50 శాతం కూడా దాటకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top