బియ్యం వ్యాపారి దారుణ హత్య | Rice trader brutal murder | Sakshi
Sakshi News home page

బియ్యం వ్యాపారి దారుణ హత్య

Mar 7 2015 3:06 AM | Updated on Sep 2 2017 10:24 PM

రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురై శుక్రవారం పొలాల్లో శవమై కనిపించాడు.

గుడ్లూరు : రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురై శుక్రవారం పొలాల్లో శవమై కనిపించాడు. పరకొండపాడు పంచాయతీ పరిధిలోని వడ్లమూడివారిపాలెం గ్రామ పొలాల్లో పొగాకు తోటల్లో పరిగ ఆకులు ఏరుకోవటానికి వెళ్లిన మహిళలకు గంగయ్య అనే రైతు పొలంలో జమ్మి చెట్టు కింద మృతదేహం కనిపించడంతో స్థానిక రైతులకు విషయం తెలియజేశారు. వారు గుడ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు సీఐ లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

సీఐ తెలిపిన వివరాల మేరకు.. కందుకూరులోని వాసవీ నగర్‌లో నివాసం ఉండే నూకల వెంకటసుబ్బయ్య హోల్‌సేల్ వ్యాపారుల వద్ద బియ్యం కొనుగోలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 4వ తేదీ షాపుకు వెళుతున్నానని భార్య అపర్ణకు చెప్పి ఇంటి వద్ద నుంచి వెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అపర్ణ భర్త వెంకటసుబ్బయ్యకు ఫోన్ చేసింది. ఫోన్ పనిచేయకపోవడంతో బంధువులకు సమాచారం అందించింది. వారు షాపు వద్దకు వెళ్లి చూడగా మూసి ఉండటంతో బయటకు వెళ్లి ఉంటాడని భావించారు. అయితే రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో 5వ తేదీ బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేసినా వెంకటసుబ్బయ్య జాడ కనిపించలేదు. రాత్రికి రూరల్ పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు.

సీఐ లక్ష్మణ్ శుక్రవారం ఉదయం వాసవీనగర్‌కు వెళ్లి వెంకటసుబ్బయ్య భార్య అపర్ణ వద్ద వివరాలు సేకరించారు. అదే సమయంలో వడ్లమూడివారిపాలెం గ్రామ పొగాకు తోటల్లో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని సమాచారం అందుకున్న సీఐ అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడకు అర కిలోమీటరు దూరంలో మృతుడి మోటారుసైకిల్ కూడా ఉంది. మోటారు సైకిల్ నంబరు ఆధారంగా మృతుడు కందుకూరుకు చెందిన వెంకట సుబ్బయ్యగా నిర్ధారించారు.

సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ దుండగులు వెంకట సుబ్బయ్య (39)ను ఇక్కడకు తీసుకొచ్చి చంపి వెళ్లిఉంటారని తెలిపారు. తలపై బలమైన గాయాలు  ఉండటంతో కత్తితో గానీ గొడ్డలితోకానీ కొట్టి చంపి ఉంటారని పేర్కొన్నారు. రెండు రోజులు క్రితం హత్య జరిగిఉండడంతో మృతదేహం ఉబ్బి ఉంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సీఐ వెంట ఏఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement