పిల్లల బియ్యం  మెక్కేశారు...! | Sakshi
Sakshi News home page

పిల్లల బియ్యం  మెక్కేశారు...!

Published Tue, Aug 14 2018 8:20 AM

Rice Bags Corruption In Govt Schools  YSR Kadapa - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: పాఠశాలలో విద్యార్థులకు వండిపెట్టాల్సిన 60 బస్తాల బియ్యం అక్కడి అధికారి ‘స్థానిక’ సిబ్బందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కున మింగేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. తమను ప్రశ్నించేవారు లేరనుకున్నారో.. లేక గతంలో బోలెడు అవినీతి చేసినా ఎవరూ కనుగొనలేకపోయారనుకున్నారో తెలియదు కానీ, ఈసారి బడి పిల్లల బియ్యానికే ఎసరు పెట్టి ఏకంగా 60 బస్తాలను మాయం చేశారు. మునుపటి ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేసి కొత్త ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ అవినీతి ఒక్కసారిగా వెలుగు చూడడంతో బియ్యం బకాసురులు ఉలిక్కి పడుతున్నారు.


కొండాపురం జిల్లా ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్నబోజన పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ఈ పాఠశాలలో నెలకు 18 నుంచి 20 బస్తాలు బియ్యం ఖర్చు అవుతాయి. విద్యార్థుల హాజరు ప్రకారం అక్కడ ఖర్చు అయిన బియ్యం కంటే 2017–18 విద్యా సంవత్సరంలో 60 బస్తాలు  అదనంగా పంపించినట్లు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అంటే ఈ ఏడాది ఏప్రిల్‌ 23 నాటికి ఆపాఠశాలలో 30 క్వింటాళ్లు నిల్వ ఉండాలి. వాస్తవంలో ఒక్క క్వింటా కూడా మిగులులో  లేదు.
 
బాగోతం వెలుగు చూసిందిలా..
గతంలో బియ్యం గోల్‌మాల్‌ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా ముగిసేది. ఈపరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్య మే31న పదవీ విరమణ చేశారు. తదుపరి సీనియర్‌ ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించే సమయంలో బియ్యం వ్యవహారం వెలుగుచూసింది. రికార్డు ప్రకారం తనకు 60 బస్తాలు నిల్వ చూపిస్తే తప్పా పూర్తి బాధ్యతలు తీసుకోలేనని గట్టిగా చెప్పడంతో అటు పూర్వపు ప్రధానోపాధ్యాయుడిని మందలించలేక, ప్రస్తుత ప్రధానోపా«ధ్యాయుడికి నచ్చజెప్పలేక అధికారులు తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది.

‘స్థానిక’ సిబ్బందిపైనా అనుమానాలు..
ఈస్వాహా పర్వంలో పూర్వపు ప్రధానోపాధ్యాయుడు ఈశ్వరయ్యతోపాటు స్థానికంగా ఉన్న కొందరు బోధన, బోధనేతర సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు ప్రధానోపాధ్యాయుడి అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవ్వరికీ చేతనైనన్ని  మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈపాపంలో తనకు భాగం ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు అక్రమార్కులను వారించలేనట్లు సమాచారం. గతంలో సైతం  ఈశ్వరయ్య పాఠశాల ఆవరణంలో ఉన్న దశాబ్దాల కాలం నాటి పెద్ద వృక్షాలను నరికించి వాటిని అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఒక ట్రాక్టర్‌ మొద్దులు తరలించిన అనంతరం ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో విధిలేని పరిస్థితుల్లో అటవీ అధికారులు జోక్యం చేసుకోని కొండాపురం పోలీసుస్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ మిగులు మొద్దులు పాఠశాల ఆవరణలో కుళ్లిపోతున్నా కేసు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు.

అధికారులు ఏమి చేస్తున్నట్లు..
ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు భోంచేశారన్న విషయాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఏ రోజుకు ఆరోజు మొబైల్‌ యాప్‌ ద్వారా తెలియజేస్తూండాలి. ఈ లెక్క ఆధారంగానే తర్వాత నెలా బియ్యం కేటాయింపులు చేస్తారు. కొండాపురం పాఠశాలలో 100శాతం విద్యార్ధులు హాజరవుతున్నారని రాసినప్పటికీ ఇక్కడ నెలకు 20 బస్తాలు కంటే ఎక్కువ బియ్యం ఖర్చు కావు. అలాంటిది ఏకంగా మూడు నెలలకు సరిపడే బియ్యాన్ని అధికారులు ఆపాఠశాలకు అదనంగా కేటాయించి ఆవాటి లెక్క జమల అడుగక పోవడం ఆశ్చర్యం కల్గించక మానదు.
 

ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు దృష్టి సారించకపోయి ఉంటే ఇక 60 బస్తాల స్వాహా పురాణం వెలుగు చూసే అవకాశం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కొండాపురం జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకున్న బియ్యం స్వాహా ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పదవీ విరమణ చేశారు కదా..అనారోగ్యంతో ఉన్నారు కదా....అని ఉపేక్షిస్తూ పోతే వ్యవస్థను మరింత అవినీతి మయం చేసినట్లు అవుతోందని విద్యావేత్తలు వాపోతున్నారు.

Advertisement
Advertisement