ఏసీబీ వలలో రెవెన్యూ తిమింగలం

Revenue Officer Arrested ACB Raid in East Godavari - Sakshi

పట్టుబడిన సెట్రాజ్‌ సీఈఓ రఘుబాబు

తూర్పు, విశాఖ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు

రూ.15 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

రూ.8 లక్షల నగదు, రూ.20 లక్షల డిపాజిట్‌ పత్రాలు స్వాధీనం

భారీగా చిక్కిన ఆస్తుల పత్రాలు,బంగారు ఆభరణాలు

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: జిల్లా యువజన సర్వీసుల శాఖ (సెట్రాజ్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి లంకే రఘుబాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఎనిమిదిచోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. రెవెన్యూ శాఖలో రఘుబాబు 1982లో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. 1995లో గ్రూప్‌–2 పరీక్ష పాసై డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. పెదపూడి, మారేడుమిల్లి, రాజమహేంద్రవరం, కాజులూరుల్లో తహసీల్దార్‌గా, కాకినాడ ఆర్డీవో కార్యాలయం పరిపాలనాధికారిగా పని చేశారు. 2014లో కాకినాడ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. 38 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారి పని చేశారు. కాకినాడ ఆర్డీవోగా పని చేసిన సమయంలో వ్యవసాయ భూములను నాన్‌ లే అవుట్లుగా మార్చేందుకు రైతుల నుంచి ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సామాజికవర్గం కావడంతో ఆయన హయాంలో సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను, పలు సామాజిక స్థలాలను ఆయన వర్గీయులకు డబ్బులు తీసుకొని అప్పగించేశారన్న ఆరోపణలున్నాయి. కాకినాడ ఆర్డీవోగా ఉన్న సమయంలోనే వనమాడికి కాకినాడ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని ఇచ్చేశారని పలువురు రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కాకినాడ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్‌ఆర్‌ నగర్‌ రోడ్డు నంబర్‌–1లో ఉన్న రఘుబాబు ఇంటితో పాటు సెట్రాజ్‌ కార్యాలయం, రాజమహేంద్రవరంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుబాబు ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు, రూ.20 లక్షల డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, పలు బ్యాంకు పుస్తకాలతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు, ప్లాట్లకు సంబంధించిన దస్తావేజులను అధికారులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు పెదమల్లాపురం, గాజువాక, సూర్యారావుపేటల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, కాకినాడ ఆర్‌ఆర్‌ నగర్, సూర్యారావుపేటల్లో రెండు ఇళ్లు, శ్రీరామనగర్‌లో రెండు అపార్టుమెంట్లలో ప్లాట్లు, జి.వేమవరంలో పంట పొలాలు, రొయ్యల చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ రేటు ప్రకారం రూ.3.5 కోట్లు ఉండవచ్చని, బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.15 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉందని చెప్పారు. రాత్రి 8 గంటలు దాటినా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ రవికుమార్, ఇన్‌స్పెక్టర్‌ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు.

కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ఎస్‌ఈపైనా దాడులు
మరోపక్క ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలపై కాకినాడ నగరపాలక సంస్థ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ గంధం వెంకట పల్లంరాజుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసం ఉంటున్న సాత్వి రెసిడెన్షియల్‌ కన్వెన్షన్‌ హాలు 302 రూముపై మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాటర్‌ వర్క్స్‌ ఇంజినీర్‌గా పని చేసిన పల్లంరాజు కాకినాడ ఎస్‌ఈగా బదిలీపై వచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకే ఆయనను ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని పల్లంరాజు ఇంట్లోను, మధురవాడ వుడా కాలనీలోని అతడి తమ్ముడి ఇంట్లోను సోదాలు చేశారు. తణుకులోని అతడి తండ్రి, సోదరి ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసి, సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. భారీగా బంగారం, స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు పాస్‌ పుస్తకాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top