
అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తాం: మంత్రి శైలజానాథ్
శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడితే కచ్చితంగా ఓడిస్తామని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడితే కచ్చితంగా ఓడిస్తామని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు సమైక్యవాదానికి కట్టుబడిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరేది ప్రత్యామ్నాయం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపామని తెలిపారు. హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అసెంబ్లీలో విభజన తీర్మానం ప్రవేశపెడితే ఖచ్చితంగా ఓడించేందుకు తమ శక్తినంతటిని వినియోగిస్తామన్నారు.
గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ శాసనసభలో తీర్మానం ఆమోదం పొందిన తరువాతే ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్ శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతే కొత్త రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించిన తరువాత తాము ఏం చేస్తామనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, మీరే (మీడియా) చూస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ప్రతిరోజూ సీమాంధ్రలో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇకనైనా రాజకీయ కుట్రను పక్కనపెట్టి విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సమైక్య తీర్మానం చేసి పంపాలని బాబుకు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం సమన్యాయం అని చెప్పడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలమంతా మొదటినుంచి సమైక్య వాదానికే కట్టుబడి ఉండటంతోపాటు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తరపున ఏ ఒక్కరూ గెలవరనే విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశామని ఏరాసు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాయలసీమలోని 60 వేల ఎకరాలకు నీరందించే వివాదం ఇంకా పెండింగ్‌లో ఉందని, రాష్ట్రం విడిపోతే సీమలోని 20 లక్షలకుపైగా ఎకరాలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి ఆదేశించినా కావేరి సమస్య పరిష్కారం కాలేదని, అలాంటప్పుడు తమ సమస్యలను పరిష్కరించేదెవరని ఆయన ప్రశ్నించారు.