రెడ్డి అనేది కులం కాదు గుణం : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

Reddy is not a caste notation - Sakshi

సాక్షి, సత్తెనపల్లి: రెడ్డి అనేది కులం కాదు గుణం అని, అన్ని వర్గాలను కలుపుకొని వారికి సాయం అందిస్తూ ముందుకు సాగాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏజీకేఎం కళాశాలలో ఆదివారం రెడ్డిజన సేవా సమితి అధ్యక్షుడు బాసు లింగారెడ్డి అధ్యక్షతన రెడ్ల వనసమారాధన నిర్వహించారు.

ఈ సందర్భంగా  గోపిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మనతో పాటు వచ్చే కులాలు, మతాలను కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారన్నారు.పెన్షన్‌ నుంచి  ఇల్లు కట్టుకునేదాకా ఒక పార్టీకి, ఒక వర్గానికే ఈ రోజు పనులు జరుగుతున్నాయన్నారు.

సత్తెనపల్లి, నరసరావుపేట  నియోజకవర్గాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని తెలిపారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రెడ్లకు రాజ్యాధికారం రావాలంటే అన్ని కులాలను ప్రేమించే మంచి మనస్సు ఉండాలని, ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే ధనం కావాలన్నారు.

 వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి రెడ్లు ఎనలేని సేవలు అందించారన్నారు. వారి సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా పుస్తకాలు ప్రచురించాలని సూచించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆరిమండ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ రెడ్డి ఒక కులం కాదని, ఒక టైటిల్‌ అన్నారు. రాబోయే రోజుల్లో అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నలందా ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి ఆరిమండ విజయశారదారెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌.గీతాహాసంతి, డాక్టర్‌ గజ్జల నాగభూషణ్‌రెడ్డి, డాక్టర్‌ ఎస్‌.రాజమోహన్‌రెడ్డి, డాక్టర్‌ షకీలా శ్రీధర్, చెన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వెన్నా సాంబశివారెడ్డి, యేరువ ప్రతాపరెడ్డి, న్యాయవాది మర్రి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. ముందుగా  వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఎన్‌ఎస్‌పీ ఏఈగా పనిచేస్తూ మృతి చెందిన ఇనగంటి హిమబిందు మృతికి మౌనం పాటించారు. ఈ సందర్భంగా మహిళలకు వివిధ లక్కీ డిప్‌లు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి,  వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ కొమ్మారెడ్డి చెంచిరెడ్డి, ముప్పాళ్ల మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ఇందూరి నరిసింహారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, యాంపాటి కోటిరెడ్డి, అచ్చిరెడ్డి, అల్లు మధుసూదన్‌రెడ్డి, కొమ్మారెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top