‘ఎర్ర’దొంగలపై టాస్క్‌‘ఫోర్స్’ | 'Red' stolen Task 'Force' | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’దొంగలపై టాస్క్‌‘ఫోర్స్’

Sep 26 2013 3:01 AM | Updated on Sep 1 2017 11:02 PM

ఎర్రచందనం అక్రమరవాణాపై జిల్లా ఎస్పీ కాంతిరాణా టాటా ఉక్కుపాదం మోపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చిత్తూరు కేంద్రంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు, జిల్లా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.

సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమరవాణాపై జిల్లా ఎస్పీ కాంతిరాణా టాటా ఉక్కుపాదం మోపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చిత్తూరు కేంద్రంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు, జిల్లా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలో మదనపల్లె, పలమనేరు పోలీసు సబ్‌డివిజన్లలో ఎర్రచందనం కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. పీలేరు సర్కిల్‌లో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. చిత్తూరు కేంద్రంగా ఒకతను పెద్దఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇతనికి కర్ణాటక, తమిళనాడులోని ఎర్రచంద నం స్మగ్లర్లతో ఎక్కువ సంబంధాలున్నట్లు తెలిసింది. పలుమార్లు ఇతనిపై ఎర్రచందనం కేసులు నమోదయినా పోలీసులకు దొరకలేదు. ఈ కీలక స్మగ్లర్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు.
 
 పాత స్మగ్లర్ల జాబితా బయటకు

 ఈ క్రమంలో  ఎర్రచందనం పాత స్మగ్లర్ల జాబితాను టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఉదయ్‌కుమార్ బయటకు తీయించారు. వీరందరూ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, వీరి కి అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎవరెవరు సహకరిస్తున్నారనే దిశగా ప్రత్యేకంగా ఒక ఫైల్ సిద్ధం చేశారు. ఇలాంటివారిపై నిఘా పెట్టి వారిని పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మార్చుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 
 స్మగ్లర్ల అడ్డా బెంగళూరు రూరల్

 బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట ప్రాంతంలోని కటికనహళ్లి అనే గ్రామం ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, చిత్తూరు జిల్లా పోలీసులు గుర్తించారు. శేషాచల కొండల నుంచి తరలిస్తున్న ఎర్రచందనాన్ని ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న గోడౌన్లలో ఉంచి అక్కడి నుంచి విదేశాలకు విక్రయించే వ్యాపారస్తులకు, బడా స్మగ్లర్లకు వీరు అందజేస్తున్నారు. ఇటీవల ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు కీలక స్మగ్లర్లు ముక్తియార్, బాబును గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలో టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్ చేపట్టి కింగ్‌పిన్‌లుగా వ్యవహరిస్తున్న పెద్ద స్థాయి చేపలను వేటాడాలని పోలీసులు నిర్ణయించారు. మొత్తంమీద జిల్లా పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేందుకు ఎస్పీ కాంతిరాణా టాటా పటిష్టంగా కేసులు నమోదు చేయిస్తున్నారు.
 
 మూడు రకాల వ్యూహం

 ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు మూడు రకాల వ్యూహంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుకు వెళుతున్నారు. మొదట అడవిలో ఎర్రచందనం చెట్లు నరికే దశలోనే కొట్టనీయకుండా తమిళనాడు కూలీలను అడ్డుకుని అరెస్టు చేసేందుకు దృష్టిసారించారు. రెండవ చర్యగా నరికిన ఎర్రచందనం రవాణాను మధ్యలోనే అడ్డుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. మూడవ చర్యగా తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కింగ్‌పిన్‌లు, బడా స్మగ్లర్ల కేంద్రాలపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తద్వారా ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికడతామని పోలీసులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement