పనిచేసే చోటు అత్తగారిళ్లు కాదు | RD Murali Krishna Goud fires on the muncipal offficers | Sakshi
Sakshi News home page

పనిచేసే చోటు అత్తగారిళ్లు కాదు

Apr 26 2015 4:26 AM | Updated on Sep 3 2017 12:52 AM

రీజియన్ పరిధిలో కొందరు మున్సిపల్ కమిషనర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని...

మున్సిపల్ శాఖ ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్
కర్నూలు(జిల్లా పరిషత్): రీజియన్ పరిధిలో కొందరు మున్సిపల్ కమిషనర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని, అత్తగారింటికి వచ్చినట్లు విధులకు వస్తున్నారని మున్సిపల్ శాఖ ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ మండిపడ్డారు. కొందరు కమిషనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జీపీఎస్ విధానంతో అందరిపై నిఘా ఉంటుందన్నారు. దొరికితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. శనివారం ఆయన కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 38 మున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రీజియన్ పరిధిలో ఆస్తి పన్ను 90 శాతం వసూలు చేశామన్నారు. పన్నులు బాగా వసూలు చేసిన మున్సిపాలిటీల్లో టాప్‌టెన్‌లో ఏడు మున్సిపాలిటీలు మనవేనన్నారు. అందులో స్టేట్ ఫస్ట్, స్టేట్ లాస్ట్ కూడా మనదేన్నారు. నగరి 23 శాతం మాత్రమే వసూలు చేసి ఆఖరులో స్థానంలో నిలిచిందన్నారు. 34 మున్సిపాలిటీలు 90 శాతం, 3 మున్సిపాలిటీలు 85 నుంచి 87 శాతం, ఒకటి మాత్రం 23 శాతం వసూలు చేశాయన్నారు.

మున్సిపాలిటీల అకౌంట్స్‌కు వార్షిక ఆడిట్ పూర్తయిందన్నారు. అన్ని మున్సిపాలిటీలకు 4జీ ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. నాలుగు జిల్లాల్లో 1.30లక్షలు వ్యక్తిగత మరుగుదొడ్లు, 263 కమ్యూనిటీ మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. చికెన్, మటన్‌లను అద్దాల పెట్టెలో ఉంచి అమ్మాలని, ఈ మేరకు కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాంసం విక్రయ దుకాణానికి తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. కుక్కలు, పందుల విషయంలో నిర్ణీత పద్ధతిలో చర్యలు తీసుకుంటామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.212కోట్లలో రూ.68కోట్లు బకాయి ఉండిందని, అది కూడా వచ్చేసిందన్నారు.

2014-15 సంవత్సరానికి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించానమ్నారు. మున్సిపాలిటీల్లో ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించామన్నారు. రీజియన్ పరిధిలో గుర్తింపులేని మురికివాడలను గుర్తిస్తున్నామన్నారు. స్మార్ట్‌వార్డులను కౌన్సిలర్లు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని చెప్పారు. తాను కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని 41వ వార్డును దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్‌ఈ సుధాకర్‌రావు, అనంతపురం మున్సిపాలిటీ కమిషనర్ నాగవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement