
పురపాలక శాఖలో 32 మంది కమిషనర్లు వెయిటింగ్
డిప్యుటేషన్‌పై వచ్చిన వారికి కమిషనర్లుగా చాన్స్
కొన్ని చోట్ల ఇన్‌చార్జీలుగా చక్రం తిప్పుతున్న మేనేజర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో జూన్‌లో భారీ సంఖ్యలో జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీలు కొత్త సమస్యను తెరమీదకు తెచ్చాయి. సాధారణ బదిలీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ బదిలీలు, పదోన్నతుల ద్వారా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. అయితే, ఈ బదిలీల్లో మున్సిపల్ శాఖకు చెందిన కమిషనర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ‘ఆన్ డ్యూటీ’పై వచ్చిన వారికి కూడా పోస్టింగులు దక్కాయి. మరోవైపు మున్సిపల్ శాఖకు చెందిన 32 మంది కమిషనర్లకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా ‘వెయిటింగ్’జాబితాలో పెట్టారు.
కొన్ని మున్సిపాలిటీల్లో మేనేజర్లుగా ఉన్న వారికే మున్సిపల్ కమిషనర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదోన్నతులు, ఆన్‌డ్యూటీపై వచ్చిన వారికి బదిలీల్లో ప్రాధాన్యత దక్కడంతో సొంత శాఖకు చెందిన కమిషనర్లు పోస్టింగు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్‌లో ఉన్న 32 మంది కమిషనర్లలో 25 మంది స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ వన్ కమిషనర్ హోదాలో ఉన్న వారే కావడం గమనార్హం. వీరిలో కొందరికి ‘100 రోజుల ప్రణాళిక’ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించినా నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తమకు భవిష్యత్తులో పోస్టింగు వచ్చినా వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించిన వేతనాలు తిరిగి పొందడంలో ఆర్థిక శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెయిటింగ్ జాబితాలో ఉన్న ఇద్దరు స్పెషల్ గ్రేడ్ కమిషనర్లు పదవీ విరమణ గడువుకు చేరువలో ఉన్నారు. పోస్టింగ్ లేకుండా రిటైర్ అయితే తమకు దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకుండా పోతాయనే ఆందోళనలో వారు ఉన్నారు.
బయటి నుంచి వచ్చినవారిదే హవా
రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ 1, 2, 3తో పాటు స్పెష ల్ గ్రేడ్, సెలక్షన్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. వీరి లో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ద్వారా నేరుగా ఎంపికైన వారితోపాటు కొందరు మేనేజర్ల స్థాయి నుంచి, మరికొందరు సెక్రటేరియట్ సర్వీసుల నుంచి పదోన్నతులపై కమిషనర్లుగా వచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖ లకు చెందిన వారు కూడా ‘ఆన్‌డ్యూటీ’పేరిట తమ పర పతి ఉపయోగించి మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగులు దక్కించుకున్నారు.
అయితే, పదోన్నతులు, ఆన్ డ్యూటీలు ఇవ్వడంలో మున్సిపల్ కమిషనర్ల ఖాళీలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సొంత శాఖకు చెందిన వారిని వెయిటింగ్ జాబితాలో చేర్చి, బయటి నుంచి వచ్చినవారికి పోస్టింగులు ఇచ్చారు. పోస్టింగుల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిళ్లతో పాటు ఇతర అంశాలు కూడా కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహాలో పోస్టింగులు పొందిన వారు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కీలక మున్సి పాలిటీల్లో తిష్ట వేశారనే విమర్శలు ఉన్నాయి.
పదోన్నతులు, ఆన్‌డ్యూటీ ద్వారా కమిషనర్లుగా పోస్టింగులు పొందిన వారికి పురపాలన, పట్టణాభివృద్ధిపై అనుభవం లేకపోవడం కూడా క్షేత్ర స్థాయిలో పలు సమస్యలకు దారితీస్తోంది. గత నెలలో జరిగిన బదిలీల్లో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు వెయిటింగ్ జాబితాలో ఉన్న కమిషనర్లకు పోస్టింగులు ఇచ్చే ప్రతిపాదనలు ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.