పోర్టబులిటీ ద్వారా రేషన్‌ సరుకులు | Ration Goods By Portability | Sakshi
Sakshi News home page

పోర్టబులిటీ ద్వారా రేషన్‌ సరుకులు

Aug 20 2018 2:54 PM | Updated on Aug 20 2018 2:54 PM

Ration Goods  By Portability - Sakshi

గజపతినగరం: పురిటిపెంట రేషన్‌షాపులో ఈకేవైసీని పరిశీలిస్తున్న డీఎస్‌ఓ సుబ్బరాజు 

గజపతినగరం : జిల్లాలో 70 వేల రేషన్‌కార్డుదారులకు పోర్టబులిటీ ద్వారా రేషన్‌ సరుకులు ఇస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్‌.సుబ్బరాజు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో సమారు మూడు లక్షల మందికి ఈ విధానం వల్ల సరుకులు ఇస్తున్నట్లు చెప్పారు. పురిటిపెంట రేషన్‌డిపోను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈకేవైసీ వేగవంతం చేయడంలో భాగంగా తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1.36 లక్షల మందికి ఈకేవైసీ చేయాల్సి ఉందన్నారు. అందుకోసమే డిపోలను సందర్శిస్తూ వేగవంతానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

అలాగే 2.1 లక్షల మందికి యూఐడీ ఈకేవైసీ చేయాల్సి ఉందని తెలిపారు. 1117 కార్డులకు బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ పూర్తికాలేదని, ఐదు రోజుల్లో కార్డుదారులు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ గ్రామ స్వరాజ్య అభియాన్‌లో ఉజ్వల పథకం ద్వారా జిల్లాలో 25 వేల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గత ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి మిల్లర్ల నుంచి 73 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి రావాల్సి ఉందని తెలిపారు.

కొత్తగా రేషన్‌కార్డులో సభ్యులు చేరడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉండడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విలేకరులు ప్రశ్నించగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా గిడ్డంగుల ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గజపతినగరం పౌరసరఫరాల ఉప తహసీల్దార్‌ ఎన్‌వీవీఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు.

1100 నంబర్‌కు ఫోన్‌ చేయాలి..

దత్తిరాజేరు: కొత్తగా రేషన్‌కార్డులు కావాలనకునేవారు 1100 నంబర్‌కు ఫోన్‌ చేస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని డీఎస్‌ఓ ఎన్‌. సుబ్బరాజు తెలిపారు.మండలంలోని పెదమానాపురం, మరడాంలో గల రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరుకుల పంపిణీలో తేడాలుంటే చర్యలు తప్పవన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు కార్డుల్లో పేర్లు రద్దయిన వారికి డీలర్ద ద్వారా సరుకులు ఇప్పిస్తున్నట్లు చెప్పారు.

ఇంతవరకు బయోమెట్రిక్‌ చేసుకోలేని వారందరూ వెంటనే బయోమెట్రిక్‌ చేసుకోవాలని సూచించారు. 13 సంవత్సాలు దాటిన పిల్లలకు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్‌ చేయించాలన్నారు. గతంలో చాలా కటుంబాలు పల్స్‌సర్వేలో పాల్గొన్నా వారి పేర్లు పౌరసరఫరాల జాబితాలో చేరకపోవడంతో రేషన్‌ సరుకులు అందలేదన్నారు.త్వరలో వారిందరికీ సరుకులు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పెదమానాపురంలో చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పౌరసరఫరాల అధికారి రవిశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement