ఏపీ సర్కార్‌ డబుల్‌ గేమ్‌! | Raise retirement age to 60 in APSRTC | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్‌ డబుల్‌ గేమ్‌!

Nov 11 2017 3:47 PM | Updated on Aug 20 2018 3:30 PM

Raise retirement age to 60 in APSRTC - Sakshi

సాక్షి, అమరావతి : ‘‘ఆర్టీసీలో ఉద్యోగులు అడగకుండానే పదవీ విరమణ వయస్సు పెంచాం. 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంచాం. అందరికీ సర్వీసు పెంపు అమలుచేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేశాం.(ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్వర్ణోత్సవ సభలో సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి.) ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు హామీని ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్లుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి యాజమాన్యం మోకాలడ్డుతుండడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని.. పైగా ఆర్టీసీకి బోర్డు కూడా ఏర్పాటు కానందున వయో పరిమితి పెంపు సాధ్యంకాదని యాజమాన్యం సాకుగా చెబుతోంది.

9, 10 షెడ్యూళ్లలో ఉన్న కార్పొరేషన్లు, సంస్థల్లో 60 ఏళ్ల వయో పరిమితి నిబంధన అమలుచేయాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 8న జీవో–138ను జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ షెడ్యూల్‌ 9లో ఉంది. ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం.. ఆర్టీసీలో 2014 జూన్‌ 2 నుంచి పదవీ విరమణ చేసిన వారికి 60 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. కానీ, గతేడాది నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన వారు సుమారు అన్ని కేడర్‌లలో 3,600 మంది వరకు ఉన్నారు. వీరంతా రెండేళ్ల సర్వీసు పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

నిబంధనల సాకు..
కాగా, బోర్డు లేకపోవడంతో వయో పరిమితి పెంపు కుదరదంటున్న యాజమాన్యం.. ఆర్టీసీలో 60 ఏళ్ల పెంపు నిర్ణయం తీసుకోవాలంటే సంస్థ విభజన జరగాలని, కొత్తగా బోర్డు ఏర్పాటుచేసుకోవాలని నిబంధనలున్నాయి. ఈ నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం సాకుగా చూపుతోంది. అయితే, గత మూడేళ్లుగా ఆర్టీసీ బోర్డు లేకుండానే యాజమాన్యం అన్ని నిర్ణయాలు తీసుకుందని, ఇప్పటివరకు 3 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేసిందని, ఆర్టీసీ హౌజ్‌ నిర్మాణం కూడా చేసినట్లు ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. బోర్డు అనుమతి లేకుండా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేసే అవకాశంలేదని, మానవతా దృష్టితో ఉద్యోగుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నా అందుకు యాజమాన్యం ససేమిరా అంటోంది.

మూడేళ్లుగా నియామకాల్లేవు
ఇదిలా ఉంటే.. గత మూడేళ్ల నుంచి ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య 7,130గా ఉంది. అయితే, 2014 నుంచి 2016 వరకు పదవీ విరమణ చేసిన వారికి న్యాయం జరిగే అవకాశాల్లేవు. అంతేకాకుండా, గత మూడేళ్లగా సంస్థలో ఏ కేడర్‌లోనూ ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయలేదు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా ఉద్యోగులపట్ల కఠినంగా వ్యవహరించడం సబబు కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్య తీరుపై రిటైరైన ఉద్యోగులు కొందరు ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం..
9, 10 షెడ్యూల్‌లో ఉన్న విద్యుత్‌ సంస్థ, గృహ నిర్మాణం, సివిల్‌ సప్లైస్, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తదితరాల్లో 60 ఏళ్లకు పదవీ విరమణ జీవోను అమలుచేశారు. ఒక్క ఆర్టీసీలోనే అడ్డంకులు సృష్టిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం.  ∙పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరితో కలిసి త్వరలో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం. – తాడంకి ప్రతాప్‌ కుమార్, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నేత  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement