రచ్చబండ’పై అధికార పార్టీలో రచ్చ మొదలైంది. తాడిపత్రి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలన్న సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపాదనను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘రచ్చబండ’పై అధికార పార్టీలో రచ్చ మొదలైంది. తాడిపత్రి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలన్న సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపాదనను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఇది పసిగట్టిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తే తాము బహిష్కరిస్తామని సీఎం కిరణ్‌కు తెగేసిచెప్పారు. శింగనమల నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది అధికార పార్టీలో ఆధిపత్య పోరును తారస్థాయికి చేర్చింది. ఈనెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండను నిర్వహించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. తాడిపత్రిలో రూ.32 కోట్ల వ్యయంతో మున్సిపల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. రూ.2.2 కోట్ల వ్యయంతో మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
రూ.202 కోట్ల వ్యయంతో చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తైది. ఇకపై ఏ ఎన్నికల్లో పోటీచేసేది లేదని పదే పదే ప్రకటిస్తోన్న జేసీ దివాకర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో తన కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడం.. మున్సిపల్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ భవనాన్ని సీఎంతో ప్రారంభింపజేసి- నియోజకవర్గ అభివృద్ధి తమకే సాధ్యమనే భావనను ప్రజల్లో కలిగించడానికి జేసీ ఎత్తులు వేస్తున్నారు.
తద్వారా ఎన్నికల్లో తన కుమారుడికి లబ్ధి చేకూర్చాలన్నది ఆయన ఎత్తుగడ. ఆ క్రమంలోనే ఇటీవల సీఎంను కలిసి రచ్చబండ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో నిర్వహించాలని కోరారు. పనిలో పనిగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడం.. మున్సిపల్ కాంప్లెక్స్, కార్యాలయ భవనాన్ని ప్రారంభించడానికి సీఎంను ఆహ్వానించారు. ఇటీవల జేసీతో సాన్నిహిత్యం పెరిగిన దృష్ట్యా తాడిపత్రిలో పర్యటించడానికి సీఎం కిరణ్ అంగీకరించారు. ఈనెల 19నగానీ.. 24నగానీ తాడిపత్రిలో పర్యటిస్తానని జేసీకి కిరణ్ హామీ ఇచ్చారు.
దాంతో.. సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలని అధికారులపై జేసీ ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలోనే చాగల్లు రిజర్వాయర్‌కు మిడ్ పెన్నార్ నుంచి నీటిని కూడా విడుదల చేయించారు. ఇది పసిగట్టిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు ఇటీవల సీఎం కిరణ్‌ను వేర్వేరుగా కలిశారు. తాడిపత్రి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తే.. ఆ పర్యటను తాము బహిష్కరిస్తామని తెగేసిచెప్పారు. పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట రచ్చబండ నిర్వహించాలని సీఎం కిరణ్‌ను మంత్రి రఘువీరా కోరారు. శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలంలో పర్యటించి.. రచ్చబండ నిర్వహించాలని మంత్రి శైలజానాథ్ కోరారు. ఈ నేపథ్యంలో సీఎం ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.