వివాహితతో ఫేస్‌బుక్‌ చాటింగ్‌ ప్రాణం తీసింది!

Purohit priest Murder to FaceBook chating in married women - Sakshi

 వివాహితతో చాటింగ్‌ తెచ్చిన ముప్పు 

 ఆమె భర్తకు తెలిసిన వ్యవహారం

 స్నేహితుల సాయంతో హత్య 

 హతుడు పురోహితుడు

కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఫేస్‌బుక్‌ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలికొనగా.. భార్య బిడ్డలను అనాథలను చేసింది. వివరాల్లోకి వెళితే..కృష్ణలంక మెట్లబజార్‌కు చెందిన లంక రామాంజనేయులుశర్మ(35) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతనికి బాలాజీనగర్‌కు చెందిన ఒక వివాహితతో ఫేస్‌బుక్‌లో పరిచయం అవ్వడంతో.. చాటింగ్‌ చేసుకుంటూ.. ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లో ఎలాక్ట్రానిక్‌ షాపు నిర్వహిస్తున్న వివాహిత భర్త సాయిశ్రీనివాస్‌కు తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఫోన్‌ను పరిశీలించి రామాంజేయులుశర్మతో చాటింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అతను రామాంజనేయులుశర్మను ఎలాగైనా మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15వతేదీన అతనికి ఫోన్‌చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు. 

అప్పటికే అక్కడ సెల్లారులో తన ఐదుగురు స్నేహితులతో కలసి సాయిశ్రీనివాస్‌ ఇష్టానుసారం కొట్టసాగాడు. దీంతో చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో స్నేహితుల మధ్య చిన్న గొడవ అని చెప్పి  ద్విచక్రవాహనంపై రామాంజనేయులుశర్మను ఎక్కించుకుని  తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు.  అక్కడే వారు మద్యం సేవించి అతన్ని ఇష్టానుసారంగా కొట్టారు. వారి దెబ్బలకు స్పృహ తప్పడంతో అక్కడ నుంచి వారు ద్విచక్ర వాహనంపై అతన్ని తీసుకుని విజయవాడ వైపు వస్తుండగా.. గన్నవరం బిస్మిల్లా హోటల్‌ సమీపంలోకి రాగానే రామాంజనేయులుశర్మ మృతిచెందినట్లు గమనించి రోడ్డుపక్కన పడేసి 108కి ఫోన్‌చేసి  పరారాయ్యారు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో 108 సిబ్బంది  సైతం వెళ్లిపోయారు. 

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఈ నెల 16న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వతేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త కనిపించడం లేదని భార్య స్వరూప కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గన్నవరంలో మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అదృశ్యమైన రామాంజనేయులు శర్మదేనని నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. మృతుడి కాల్‌డేటాలో సాయిశ్రీనివాస్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేసినట్లు అంగీకరించాడు.  హత్యకు సహకరించిన స్నేహితులు ఎన్టీఆర్, మున్నా, సాయి, ఫరూక్, సతీష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top