పూనేపల్లె ఘటనపై నిర్భయ కేసు | Punepalle incident nirbaiah case | Sakshi
Sakshi News home page

పూనేపల్లె ఘటనపై నిర్భయ కేసు

Mar 10 2015 2:08 AM | Updated on Jul 28 2018 8:51 PM

పూనేపల్లె ఘటనపై నిర్భయ కేసు - Sakshi

పూనేపల్లె ఘటనపై నిర్భయ కేసు

పెనుమూరు మండలం, కలవకుంట పంచాయతీ ఎగువ పూనేపల్లెకు చెందిన యువతి ...

యువతిపై అత్యాచారం, హత్యకేసులో నిందితుడి అరెస్టు
 
చిత్తూరు(అర్బన్): పెనుమూరు మండలం, కలవకుంట పంచాయతీ ఎగువ పూనేపల్లెకు చెందిన యువతి(18)పై జరిగిన అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి నిందితుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పలువురిని విచారించిన పోలీసులు చివరకు సోమవారం ఒక్కడినే నిందితుడిగా తేల్చారు. కలవకుంటకే చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)పై కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసినందుకు ఐపీసీ-376, హత్య చేసినందుకు ఐపీసీ-302తో పాటు నిర్భయ యాక్టు కింద కూడా అతడిని అరెస్టుచేశారు. అంతేగాక ఆమె దళితురాలు కావడంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం నమోదు చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసు వివరాలను రాష్ట్ర ఐజీ హరీష్, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సోమవారం చిత్తూరులో విలేకరులకు వివరించారు.

ఉదయ్‌కుమార్ మొదలియార్‌తో మృతురాలికి కొంతకాలంగా పరిచయాలు ఉన్నాయి. అతడు ఐటీఐ వరకు చదువుకుని వడ్రంగి పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం వీరు మాట్లాడుకుంటూ ఆ గ్రామ సమీపంలోనే పొదల్లోకి వెళ్లారు. లైంగింక వాంఛ తీర్చాలని అతడు కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మొలతాడే తీసి గొంతుకు బిగించి చంపేసి పారిపోయాడు.
 
దర్యాప్తు ఇలా...

యువతిపై సమూహిక అత్యాచారం జరిగిందని, నిందితులు ఆరుగురని ప్రచారం జరిగింది. పోలీసు జాగిలం తొలుత ఊర్లోకి వెళ్లి ఆగిపోయింది. మరుసటి రోజు నిందితుడు ఉదయ్‌కుమార్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో పోలీసులు అతని ఇంట్లో వెళ్లి తనిఖీలు చేశారు.  అక్కడ ఆమె ఫొటో ఉండటం, అతని సెల్‌ఫోన్ కాల్స్ లిస్టులో ఆమెతో పలుమార్లు మాట్లాడినట్లు ఉండడం పోలీసులు గుర్తించారు. దీంతో వీరికి కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు భావించారు. మృతురాలి ఇంట్లో ఒక పుస్తకంలో నిందితుడి సెల్‌ఫోన్ నెంబర్ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి ముందు బామ్మతో కలిసి మేకలు మేపుతున్న ఆమె ఉదయ్‌కుమార్ రాగానే ఆమెను ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. హత్య చేసేప్పుడు ఆమె కేకలు విని అక్కడికి మరో మహిళ పరుగెత్తి వస్తుంటే..‘‘రాకు.. అక్కడే ఆగిపో, లేకుంటే నీకూ ఇదే గతి పడుతుంది’’ అని నిందితుడు గద్దించడంతో వె ళ్లిపోయింది. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, ఆ రోజు విన్న గొంతు ఇదేనని ఆమె పోలీసులకు సాక్ష్యం చెప్పింది. దాంతో అతడిని అరెస్టు చేశారు.  కేసు త్వరితగతిన విచారణ చేపట్టడానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించాలని ఉన్నతాధికారులకు పోలీసులు నివేదిక పంపారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు రామకృష్ణ, లక్ష్మీనాయుడు, సీఐలు చల్లనిదొర, చంద్రశేఖర్, ఆదినారాయణ, ఎస్‌ఐలు వాసంతి, రమణ, ఏఎస్‌ఐ హరినాథ్, కానిస్టేబుళ్లు వెంకటేశన్, ఖాదర్‌భాషా, సూర్యప్రకాష్, జయకుమార్, శ్రీనివాసులు, కుమార్‌రాజా, ప్రవీణ్, రఘురామ్, శ్రీహరి, మనిదండన్, రాజ్‌కుమార్‌కు ఐజీ, డీఐజీలు రివార్డులు అందచేసి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement