భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ- సీ25 ప్రయోగం నవంబర్ 6న నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ- సీ25 ప్రయోగం నవంబర్ 6న నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఇస్రోలోని పలు సెంటర్ల నుంచి వచ్చిన డెరైక్టర్లతో గురువారం షార్‌లో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.
పీఎస్‌ఎల్‌వీ-సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడిపై పరిశోధనల నిమిత్తం ఈనెల 28న ప్రయోగించేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉపగ్రహం అమర్చే ప్రక్రియను కూడా రెండు రోజులకు వాయిదా వేసినట్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇండోనేసియాకు రెండువేల కిలోమీటర్ల దూరంలో సముద్రంలోకి వెళ్లి రాడార్ ట్రాకింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉండడంతో నవంబర్ 6కు ప్రయోగాన్ని వాయిదా వేశారు. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలతో మార్స్ మిషన్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్టు ఇస్రో అధికార వర్గాల ద్వారా తెలిసింది.