మహిళా మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా

మహిళా మంత్రికి ఇచ్చే 	గౌరవం ఇదేనా


సాక్షి ప్రతినిధి, ఏలూరు : పంద్రాగస్టు వేడుకలు జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య దూరం పెంచనున్నాయా.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేరుగా వీరిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేకపోయినా ప్రోటోకాల్ బాధ్యతల అప్పగింత అగాధం పెంచుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జెండా వందనం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించడంపై గనులు, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోస్తా జిల్లాల్లో ఏకైక దళిత మహిళా మంత్రిగా చంద్రబాబు కేబినెట్‌లో స్థానం సంపాదించిన సుజాతను పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మాణిక్యాలరావుకు ప్రోటోకాల్ హోదా కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది.

 

 హైదరాబాద్‌లో మూడురోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీలో స్వయంగా మంత్రి సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా.. చివరకు మాణిక్యాలరావుకే జెండా వందనం చేసే బాధ్యతను అప్పగించడంపై ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా కేంద్రంలో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనకూడదని మంత్రి సుజాత నిర్ణయించుకున్నట్టు సమాచారం. తొలుత జిల్లాలో ఉండకుండా ఆ రోజు హైదరాబాద్ వెళ్లాలని భావించిన ఆమె మనసు మార్చుకుని కర్నూలులో జరిగే రాష్ట్ర వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

 ‘కృష్ణా’లో ఇలా ఎందుకు జరగలేదు?

 స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే  అవకాశం కోసం సహజంగా ఏ మంత్రి అయినా ఎదురుచూస్తారు. జిల్లాలో టీడీపీకి చెందిన ఏకైక మహిళా దళిత మంత్రిగా ఈసారి తనకే ఆ అవకాశం వస్తుందని సుజాత భావిం చారు. కానీ.. పొరుగున ఉన్న కృష్ణాజిల్లాలో అధికార పార్టీ రాజకీయాల్లో చోటుచేసుకున్న కుల సమీకరణల వల్ల ఆమెకు ఇక్కడ అవకాశం దక్కలేదని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి చెందిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు మన జిల్లాకు చెందిన మాణిక్యాలరావు కాగా, మరొకరు కృష్ణాజిల్లాకు చెందిన కామినేని శ్రీనివాస్. వీరిద్దరిలో కచ్చితంగా ఎవరో ఒకరికి జెండా వందనం చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు భావించారు.

 

 అయితే కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పక్కనపెట్టి కామినేని శ్రీనివాస్‌కు ప్రొటోకాల్ హోదా ఇచ్చే ధైర్యం చేయలేకపోయిన చంద్రబాబు మన జిల్లాకు వచ్చేసరికి దళిత వర్గానికి చెందిన సుజాతను తప్పించి మాణిక్యాలరావుకు అవకాశం ఇచ్చారని దళిత, బహుజన సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం దళిత మహిళ కాబట్టే పీతల సుజాతపై  చిన్నచూపు చూశారని ఆయా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top