
జల ఘోష!
కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యూరు.
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షకు జనం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు మండల కేంద్రాల్లో నిర్వహించిన సంఘీభావ దీక్షలకు భారీగా జనం కదలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆశల్ని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కార్యక్రమాలకు హాజరైన వైఎస్సార్ సీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో సీఎం విఫలమయ్యూరని, ఆయన చేతగాని తనం వల్లే రాష్ట్రంలో దుర్బర పరిస్థితులు దాపురించాయని మండిపడ్డాయి. నేటి నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారుతుందని, ప్రజల తర ఫున పోరాడుతున్న జగన్‌కు మద్దతుగా రైతులు కదలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.
* జగన్ జలదీక్షకు వెల్లువెత్తిన జన సంఘీభావం
* మండల స్థాయిలో కదిలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
* అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుంటే రాష్ట్రం ఎడారే
* నేటి నిర్లక్ష్యం.. భావి తరాలకు శాపం
* సీఎం చేతగాని తనం వల్లే సమస్యలని ధ్వజం
* జలదీక్షకు మద్దతుగా రైతులు కదలిరావాలని పార్టీ నేతల పిలుపు
ఒంగోలు: కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యూరు. ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రం ఎడారిలా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో జలదీక్ష బూనారు. ఈ దీక్షకు మద్దతుగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో ఆ పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టారు.
మిగులు జలాలకు అవకాశమేది..?
యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దీక్షకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని వైఎస్సార్ తపించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మిగులు జలాల ఆధారంగా కేటాయించినదని, ఈ నేపథ్యంలోపైన అక్రమ ప్రాజెక్టులు చేపడితే ఇక మిగులు జలాలు ఎక్కడనుంచి వస్తాయో ప్రజానీకం గమనించాలన్నారు.
కనుక ప్రతి ఒక్కరు అక్రమ కట్టడాలను నిరసించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు కదలిరావాలన్నారు. వై.పాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు మండలాల్లో ధర్నాలు జరిగాయి.
మేలుకోకుంటే సాగు కలే..
ఒంగోలు నియోజకవర్గ పరిధిలో జలదీక్ష కార్యక్రమం కొత్తపట్నం మండల తహశీల్దారు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఒంగోలు నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణానదిపై తెలంగాణా ప్రభుత్వం కడుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోతే రాష్ట్రం ఎడారే అన్నారు. సమస్యలను ఎదుర్కోలేక ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనుగోలుచేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రతి ఒక్కరు నేడు అసహ్యించుకుంటున్నారన్నారు.
జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దామరాజు క్రాంతికుమార్ తదితరులు మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని నమ్మి అక్కచెల్లెళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, రైతన్నలు అయినా మేలుకోకపోతే భవిష్యత్‌లో సాగు కూడా గగనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సీ లంకపోతు అంజిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆళ్ళ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మండల తహశీల్దారు రవిబాబుకు వినతిపత్రం అందించారు.
చారిత్రాత్మక దీక్ష..
దర్శి మండల తహశీల్దారు కార్యాలయం వద్ద జరిగిన దీక్షకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అక్రమ కట్టడాలను ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష చారిత్రాత్మకం అన్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించి ఆయనకు మరింత స్ఫూర్తిని అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు కదలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా దర్శి మాజీ ఎంపిపి దేవదానం, జిల్లా నాయకులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల గడియార స్తంభం సెంటర్‌లో జరిగిన ధర్నాకు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరికూటి అమృతపాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్షకు పిలుపు ఇచ్చారన్నారు.
ఈ దశలో రైతులంతా సంఘటితమై భవిష్యత్‌లో తాము ఎదుర్కోబోయే సమస్యను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్, రాష్ట్ర కార్యదర్శి కోండ్రురాజు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమించాల్సిన సమయమిదే..
కొరిశపాడు మండలం కేంద్రం వద్ద జరిగిన ధర్నాకు మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు నాయకత్వం వహించారు. గిద్దలూరులో జరిగిన దీక్షకు జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి అరుణ్‌యాదవ్ హాజరుకాగా, రాచర్లలో జరిగిన కార్యక్రమాలకు యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దుగ్గా రాంమోహన్‌రెడ్డిలు హాజరయ్యారు.
కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పిసిపల్లి, పామూరు మండలాల్లో జరిగిన ధర్నాకు జిల్లా అధికారప్రతినిధి తమ్మినేని శ్రీనివాసులరెడ్డి హాజరుకాగా, కనిగిరిలో దీక్షకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రంగనాయకులురెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు చేతగానితనం వల్లే రాష్ట్రానికి దుస్థితి దాపురించబోతోందన్నారు.
కొండపి నియోజకవర్గంలో జరిగిన దీక్షకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు హాజరయ్యారు. మాఫీ మాఫీ అంటే జనం బాకీలు రద్దువుతాయనుకున్నారని, కానీ నేడు రద్దవుతున్నది ప్రజల ఆశలు అని అందరికీ అర్థమైందన్నారు. కేవలం రెండు సంవత్సరాలలోనే దారుణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అంటూ ధ్వజ మెత్తారు.
కొండపిలో జరిగిన ధర్నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఢాకా పిచ్చిరెడ్డి హాజరయ్యారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నేటి నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారుతుందని, కనుక రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకోవాలని వినతి పత్రాలు..
పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లులో జరిగి ధర్నాకు మండల నాయకులు బండారు ప్రభాకర్ జిల్లా కార్యదర్శి వీరగంధం ఆంజనేయులు నాయకత్వం వహించారు. చినగంజాం మండలంలో జరిగినధర్నాకు ఎంపీపీ ఆసోది భాగ్యలక్ష్మి నేతృత్వంలో ధర్నా ఘనంగా జరిగింది. సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రమైన సంతనూతలపాడులో జరిగిన ధర్నాకు పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, దుంపా యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందించారు. మద్దిపాడులో ఎంపీపీ నారా విజయలక్ష్మి నేతృత్వంలో మండల తహశీల్దారు కె.ఎల్.నరసింహారావుకు వినతిపత్రం అందించారు.