‘సాక్షి’పై సభా హక్కుల నోటీసు

privilege notice to sakshi - Sakshi

ఆ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

శాసనసభ గౌరవాన్ని, సభ్యుల హక్కులను కాపాడాలి

ఉభయ సభల్లోనూ ప్రతిపాదించిన అధికార టీడీపీ సభ్యులు

సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రికపై అధికార తెలుగుదేశం పార్టీ శుక్రవారం శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ప్రతిపాదించింది. ‘సబ్‌ప్లాన్‌ పేరుతో ఓ బోగస్‌ బిల్లు.. బీసీలపై మరో వంచన వల’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం సభా హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంటూ ఈ నోటీసులను శాసనసభలో విప్‌ కూన రవికుమార్, శాసన మండలిలో జి. శ్రీనివాసులు నోటీసులు అందించారు. శాసనసభ ప్రవర్తనా నియమావళిలోని రూల్‌ నెం.169 ప్రకారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తున్నట్లు రవికుమార్‌ అసెంబ్లీలో చెప్పారు. సభలో గురువారం బీసీ సబ్‌ప్లాన్‌ బిల్లుపై జరిగిన చర్చను వక్రీకరించి దురుద్దేశపూర్వకంగా ఈ వార్తను ప్రచురించినట్లు తాను భావిస్తున్నానన్నారు.

ఈ కథనం ద్వారా ఈ శాసనసభ సభ్యుడిగా తనకున్న హక్కులను కించపరిచారని, అదేవిధంగా ఈ సభలో జరిగిన చర్చలను వక్రీకరించి ప్రచురించడం ద్వారా ఈ సభను సాక్షి దినపత్రిక అవమానపరిచినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘చర్చ సందర్భంగా ‘‘సబ్‌ప్లాన్‌ పేరుతో బోగస్‌ బిల్లు’’ అని నేనుగానీ, సంబంధిత మంత్రిగానీ, మరే ఇతర సభ్యులుగానీ గౌరవ సభలో మాట్లాడలేదు. అలాంటిది ఆ మాటలను నేనే మాట్లాడినట్లు భావన వచ్చేలా ఆ కథనంలో రాయడం పూర్తిగా దురుద్దేశపూర్వకం. అందుకు సాక్షి దినపత్రిక యాజమాన్యంపై, వార్తా కథనం ప్రచురణకు కారణమైన వారిపై, శాసనసభ నియమ నిబంధనల ప్రకారం సత్వరమే చర్యలు తీసుకుని శాసనసభ గౌరవాన్ని, ప్రతిష్టను, సభ్యుల హక్కులను కాపాడాలి’.. అని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును రవికుమార్‌ కోరారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top