మామ్మ చివరి కోరిక తీర్చడానికే... | Prime accused arrested in murder case | Sakshi
Sakshi News home page

మామ్మ చివరి కోరిక తీర్చడానికే...

Jun 27 2014 9:14 AM | Updated on Sep 2 2018 4:48 PM

మామ్మ చివరి కోరిక తీర్చడానికే... - Sakshi

మామ్మ చివరి కోరిక తీర్చడానికే...

బావ కళ్లల్లో ఆనందం చూడాలనే ..... సినిమా డైలాగ్ లాగా ఓ యువకుడు తన మామ్మ చివరి కోరిక తీర్చేందుకు హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

ఘంటసాల : బావ కళ్లల్లో ఆనందం చూడాలనే ..... సినిమా డైలాగ్ లాగా ఓ యువకుడు తన మామ్మ చివరి కోరిక తీర్చేందుకు హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.  అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు కథనం ప్రకారం  శ్రీకాకుళానికి చెందిన లింగినేని సాంబశివరావు 1998లో గ్రామంలోని మద్యం దుకాణం వద్ద తలెత్తిన వివాదం నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సూర్యచంద్రరావు అనే వ్యక్తి అయిదో నిందితుడు. ఈ కేసును రెండేళ్ల కిందట కోర్టు కొట్టివేసింది.

హతుడు సాంబశివరావు తల్లి వెంకట నరసమ్మ గుంటూరు జిల్లా లింగమనేనివారిపాలెంలో ఉంటూ తరచూ కుమారుడి ఫొటోకు పూజలు చేస్తుండేది. ఆమె మనవడు, సాంబశివరావు మేనల్లుడి కుమారుడైన రాజా కూడా అదే గ్రామంలో ఉండేవాడు. సాంబశివరావు హత్య ఘటన గురించి వెంకట నరసమ్మ రాజాకు పదేపదే వివరిస్తుండేది. తన కుమారుడిని చంపిన వారిని ముక్కలు ముక్కలుగా నరకాలని  చెబుతుండేది. ఆమె మాటలకు రాజా ప్రభావితుడయ్యాడు. వెంకటనరసమ్మ 2011లో అనారోగ్యంతో మరణించింది.

అనంతరం రాజా శ్రీకాకుళానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడే కాపురం పె ట్టాడు. సూర్యచంద్రరావును చంపేందుకు అ దను కోసం ఎదురు చూస్తున్నాడు. సూర్యచంద్రరావు ఈనెల 22న శ్రీకాకుళంలోని తన వంగతోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన రాజా అక్కడకు వెళ్లి అతడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సందర్భంగా రాజా తీసుకువచ్చిన కత్తి విరిగిపోయింది.

సూర్యచంద్రరావు వద్ద ఉన్న కత్తితోనే పని పూర్తిచేసి, పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గురువారం అతడు నిమ్మగడ్డ లాకుల వద్ద ఉండగాఅరెస్టు చేసి అవనిగడ్డ కోర్టులో హాజరుపరిచారు. మామ్మ చివరి కోరిక తీర్చేందుకే ఈ హత్య చేసినట్లు నిందితుడు చెప్పటం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement