బాక్సైట్‌ తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి

Pressure of the central for bauxite excavation - Sakshi

     అయినా ఇచ్చే ప్రసక్తే లేదు

     ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు

సాక్షి విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ గనుల తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి తెస్తోందని, గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం పాడేరులో జరిగిన గిరిజన ఉత్సవాలలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామదర్శినిలో భాగంగా చింతలవీధి పంచాయతీ ఆడారిమెట్టలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం పాడేరు జూనియర్‌ కాలేజీ మైదానంలో జరిగిన ఆదివాసీ ఉత్సవాల్లో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని చెప్పారు. బాక్సైట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్న రసల్‌ ఆల్‌ఖైమా సంస్థ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడానికి ఎవరు కారణమో తెలుసుకోవాలన్నారు. బాక్సైట్‌పై కేంద్రం కూడా తమను తప్పుపట్టి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, అయినప్పటికీ తాను చేస్తున్న అభివృద్ధిని చూసి అరుకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పుకొచ్చారు.

గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం గత నాలుగేళ్లలో 14 వేలు కోట్లు ఖర్చు చేశామని, రానున్న ఏడాది రూ.2,564 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇప్పిస్తానని పునరుద్ఘాటించారు. గిరిజన విశ్వ విద్యాలయం విజయనగరం జిల్లాలో వస్తోందన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు పాడేరు పంచాయితీకి 20 కోట్లు కేటాయిస్తామన్నారు. పాడేరు, అరుకులను కలుపుతూ హెల్త్‌ టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ, పెప్పర్‌లకు బ్రాండింగ్‌ ఇచ్చి వాటి విలువ పెంచుతామన్నారు.

గత ఎన్నికల్లో తనకు ఓట్లయలేదు, ఈ సారైన వేయాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సభలో గిరిజనుల నుండి తీవ్ర నిరసనల సెగ ఎదురయింది. బాక్సైట్‌ జీవో రద్దు చేయడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, గిరిజన విశ్వ విద్యాలయం కావాలంటూ పెద్ద పెట్టున యువత నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన సీఎం వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  బాక్సైట్‌ జీవో రద్దు చేస్తూ ప్రకటన చేయాలని లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న ఏపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సతో పాటు మరో పది మందిని పోలీస్‌లు గృహ నిర్బంధం చేశారు.

విద్యుదాఘాతంతో సీఎం సభకు వస్తున్న వ్యక్తి సజీవ దహనం 
జి.మాడుగుల (పాడేరు): పాడేరులో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబునాయుడి సభకు బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగ తెగిపడి ఒక గిరిజనుడు సజీవ దహనమయ్యాడు. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ మాదేమామిడి గ్రామానికి చెందిన సాగేని శివానందచారి (తౌడాచారి) బైక్‌పై  సీఎం సభకు వెళ్తుండగా లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామ సమీపాన  విద్యుత్‌ వైరు తెగి మీద పడటంతో మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాలతో శివానందచారి అక్కడక్కడే మృతి చెందగా, బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top