చంద్రబాబు పచ్చిమోసకారి

prasannakumar reddy fire on chandrababu - Sakshi

ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన పచ్చి మోసకారి చంద్రబాబు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం తిప్పగిరిజన కాలనీలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ – పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కోవూరు చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. 

2014 నుంచి ఇప్పటి వరకు నాలుగు కమిటీలు కర్మాగారాన్ని పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేశాయని, ఇందులోని అంశాలను అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యోగులకు రూ.20.77 కోట్లను చెల్లించాల్సి ఉందని, అయితే వీటిని అందజేయకుండా కడుపుకొట్టడం తగదని హితవు పలికారు. చంద్రబాబుకు కొడుకుపైన, సీఎం కుర్చీపై ఉన్న ముక్కువ రాష్ట్ర ప్రజలపై లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి రూ.కోట్లను వెనుకేసుకునేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ విజయం సాధించిన వెంటనే పునఃప్రారంభం
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే రూ.50 కోట్లను కేటాయించి కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర కోవూరులో జరిగే సమయంలో చక్కెర కర్మాగారానికి సంబంధించి స్పష్టమైన హామీని ఇవ్వనున్నారన్నారు. యనమల రామకృష్ణుడికి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టారంటూ జగన్‌మోహన్‌రెడ్డిపై బాబు, ఆయన కోటరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి, సిగ్గు ఉన్నా 15 రోజుల్లో ఆరోపణలను రుజువు చేయాలన్నారు.

 తెలంగాణ నీరుపారుదల శాఖలో యనమల రూ.రెండు వేల కోట్ల పనులు తీసుకున్నారనే రేవంత్‌రెడ్డి విమర్శలను ప్రస్తావించారు. యనమల నీచచరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రపై బాబు కోటరీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌బాబురెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, శివుని నరసింహులురెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ నలబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జున, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top