
వైఎస్ జగన్ కూడా మాతో సాధారణ వ్యక్తిగా కలిసిపోయేవారు.
సాక్షి, హైదరాబాద్ : తమ కాలేజీలో చదివిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రగతి మహావిద్యాలయ యాజమాన్యం పేర్కొంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్నేహితులు బొగ్గులకుంటలోని ప్రగతి మహావిద్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 1991 నుండి 1994 మధ్య ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. వైఎస్ జగన్ బీకామ్‌లో ప్రథమ స్థానంలో రాణించారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు.
వైఎస్ జగన్‌తో పాటు కలిసి చదివినందుకు చాలా సంతోషంగా ఉందని గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 'కాలేజీ ప్రిన్సిపల్ వేదాచలం అప్పట్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు. వైఎస్ జగన్ కాలేజీలో జాయిన్ అయ్యేసమయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపీగా ఉన్నారు. తమ కాలేజీ విద్యార్థులందరికీ వైఎస్ జగన్ అంటే చాలా గౌరవం ఉండేది. జగన్ కూడా తమతో సాధారణ వ్యక్తిగా కలిసిపోయేవారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజు ప్రగతి మహావిద్యాలయంలో స్నేహితులందరం కలుస్తున్నాము. కాలేజీలోనే సంబరాలను జరుపుకుంటున్నాము' అని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.