‘వైఎస్‌ జగన్‌.. కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌’ 

Pragati Mahavidyalaya College Lecturers About YS Jagan Mohan Reddy - Sakshi

ఎక్కువ సమయం లైబ్రరీలోనే ఉండేవారు

వైఎస్‌ జగన్‌లో పట్టుదల చాలా ఎక్కువ

తండ్రి స్థాయికి ఎదుగుతారని అప్పుడే అనుకునేవాళ్లం

మా పూర్వ విద్యార్థి ముఖ్యమంత్రి కావడం గర్వకారణం

ప్రగతి మహావిద్యాలయ కళాశాల అధ్యాపకుల వెల్లడి

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌. ఆయనలో పట్టుదల చాలా ఎక్కువ. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలోనే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళతారని అప్పట్లోనే అనుకునేవాళ్లం. చదువుకునే రోజుల్లో ఆయన ఎక్కువ సమయం లైబ్రరీకే కేటాయించేవారు. పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. మా పూర్వ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావటం మాకు గర్వకారణం’ అని ఆ అధ్యాపకులు ఉప్పొంగిపోయారు. కళాశాల సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ గార్డులు సైతం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. హైదరాబాద్‌ నగరం హనుమాన్‌ టేక్‌డిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1991 నుంచి 1994 వరకు బీకాం డిగ్రీ చదివారు.

శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కళాశాలకు దేశంలోనే రెండో కామర్స్‌ కళాశాలగా పేరుంది. తమ కళాశాల పూర్వ విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శనివారం మిఠాయిలు పంచారు. టపాసుల మోత మోగించి సంబరాలు చేసుకున్నారు. ‘వైఎస్‌ జగన్‌ ఎంతో చురుకైన విద్యార్థి. ఎంతో బాధ్యతగా ఉండేవారు. క్రమశిక్షణతో మెలిగేవారు’ అంటూ పలువురు అధ్యాపకులు నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ‘ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. అత్యధిక ఎంపీలను గెలిపించుకుని.. రాష్ట్రాన్ని దేశస్థాయిలో మూడో స్థానంలో నిలపటం ఆషామాషీ విషయం కాదు’ అని అధ్యాపకులు, సిబ్బంది వ్యాఖ్యానించారు.

నాయకుడిగానూ పాస్‌ అయ్యారు
బీకాం చదివే రోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లైబ్రరీలో ఎక్కువగా ఉండేవారు. తన పని తాను చేసుకుంటూ మంచి మార్కులతో పాస్‌ అయిన విద్యార్థి. జగన్‌ చదివే రోజుల్లో ప్రొఫెసర్‌ వేదాచలం ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో 1991 బ్యాచ్‌ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అందులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎదగటం గర్వకారణం. ఆయనను అధ్యాపకుల బృందం తరఫున సత్కరించుకుంటాం.
– వై.కృష్ణమోహన్‌ నాయుడు, ప్రిన్సిపాల్, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాల

మా కళాశాలకు గర్వకారణం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కామ్‌ గోయింగ్‌ స్టూడెంట్‌. బాధ్యత గల విద్యార్థిగా ఉండేవారు. ఎంతో పట్టుదల కలిగిన విద్యార్థి. ఆయన కూడా తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అప్పట్లోనే కొందరు అధ్యాపకులు మాట్లాడుకునే వారు. వాళ్ల అంచనాలు నేడు నిజమయ్యాయి. ఎన్నికైన ఎంపీల పరంగా కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో ఉంటే.. 23 ఎంపీలను గెలిపించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని 3వ స్థానంలో నిలబెట్టిన గొప్ప యోధుడు. వైఎస్సార్‌ ఆశీర్వాదంతో సీఎంగా జగన్‌ ఎదిగారు. ఆయనను గుజరాతీ సమాజ్‌ ఆధ్వర్యంలో సత్కరించుకుంటాం. 
– జిగ్నేష్‌ దోషి, కార్యదర్శి, శ్రీ గుజరాతీ ప్రగతి సమాజ్‌ కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top