ప్రభోదానంద ఆశ్రమం అసలు కథ!

Prabodhananda Ashram In Anantapur - Sakshi

ప్రభోదానంద యోగీశ్వరులుగా మారిన గుత్తా పెద్దన్న చౌదరి

ఆర్మీ నుంచి ఆశ్రమం స్థాపించి గురువుగా ఎదిగిన వైనం

‘త్రైతసిద్ధాంతం’ పేరుతో బోధనలు.. భారీగానే భక్తులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమం... ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఈ ఆశ్రమంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జేసీ వర్గీయులు, ఆశ్రమ నిర్వాహకులకు మధ్య తలెత్తిన ఘర్షణ మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు సోమవారం భక్తులను ఎవరి ఊళ్లకు వాళ్లను పంపడంతో వివాదానికి తెరపడింది. ఈ క్రమంలో అసలు ప్రభోదానంద ఎవరు? బోధనలేంటి? ట్రస్టు కార్యకలాపాలు, జేసీ బ్రదర్స్‌తో వైరం ఎలా మొదలైంది? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ.

వైద్యుడిగా సేవలు, ఆథ్యాత్మిక పుస్తకాల రచన
తాడిపత్రి మండలం అమ్మలదిన్నెకొత్తపల్లికి చెందిన గుత్తా పెద్దన్న చౌదరి ఆర్మీలో వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా పని చేశారు. తర్వాత ఆర్‌ఎంపీ వైద్యుడిగా కొన్నాళ్లు సేవలందించారు. ప్రాచీన ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానబోధపై పుస్తకాలు రచించారు. 1978లో తాడిపత్రి సమీపంలోని నందలపాడులో ఆశ్రమం స్థాపించారు. గుత్తా పెద్దన్న చౌదరి పేరును ప్రభోదానంద యోగీశ్వరులుగా మార్చుకున్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ సందేశాలను మిళితం చేసి ప్రభోదానంద ‘త్రైతసిద్ధాంతం’ రూపొందించి పుస్తకాలు రాశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లిక అనే మహిళను వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు.

జేసీ బ్రదర్స్‌తో వైరానికి బీజం
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో తాడిపత్రిలో పలువురు బీజేపీ సానుభూతిపరుల దుకాణాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ‘టైగర్‌’ ఆలె నరేంద్ర అప్పుడు తాడిపత్రిలో పర్యటించి బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. ప్రభోదానంద బీజేపీ సానుభూతిపరుడు. వేణుగోపాల్‌రెడ్డి అనే బీజేపీ నేత నాడు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయన్ను తరిమికొట్టాలని జేసీ బ్రదర్స్‌ ప్రయత్నించగా ప్రభోదానంద అడ్డుకుని ఆశ్రయం కల్పించారు. దీంతో ఆశ్రమంపై దాడికి దిగి ఖాళీ చేయించారు. ప్రభోదానంద అనంతపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ వ్యక్తి ద్వారా ఆశ్రమాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరిగినా ప్రభోదానంద గట్టిగా ఎదుర్కొన్నారు. ఓ రోజు చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళతోపాటు ప్రభోదానంద మూడేళ్ల కుమారుడు యుగంధర్‌ను కొందరు చంపేశారు. ఆశ్రమం బత్తలపల్లికి మార్చినా అక్కడ కూడా అదే పరిస్థితులు ఎదురుకావడంతో రాష్ట్రం వదిలి కర్ణాటకలోని కంప్లి చేరుకున్నారు.

పుస్తక వ్యాపారమే ప్రధానం
తాడిపత్రి ఆశ్రమంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన భారీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది. ఇక్కడ పుస్తకాలు ముద్రిస్తుంటారు. పలు భాషల్లోకి ప్రభోదానంద బోధనలను తర్జుమా చేసి పుస్తకాలు విక్రయిస్తారు. ఇదే వీరి ప్రధాన వ్యాపారం. ఆయన భక్తుల్లో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. తాను భగవంతుడిని కృష్ణుడి రూపంలో పూజిస్తానని ఇతర మతాలవారు వారి ఇష్ట ప్రకారం పూజించుకోవచ్చని చెబుతారు. భక్తులు ఆశ్రమానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిధులు అవసరమైతే భారీగా విరాళాలు ఇచ్చే భక్తులూ ఆయనకున్నారు.

బీజేపీలో చేర్చుకోవద్దని ఒత్తిడి
ప్రభోదానంద కుమారుడు యోగానంద చౌదరిని బీజేపీలో చేర్చుకోవద్దని ఉన్నత స్థాయిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభోదానంద హిందూ వ్యతిరేకి అని, యోగానందను పార్టీ నుంచి బహిష్కరించాలని ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆశ్రమాన్ని సందర్శించిన బీజేపీ నేతలు దీన్ని పట్టించుకోలేదని తెలిసింది.

12 ఏళ్ల తర్వాత తిరిగి తాడిపత్రికి
ప్రభోదానంద 12 ఏళ్ల క్రితం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో తిరిగి ఆశ్రమం స్థాపించారు. ప్రభోదానంద ఆశ్రమంలో మూడు వైపులా భవనాలున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి సమీపంలోనే ఇళ్లు కొనుగోలు చేశారు. ఆశ్రమ నిర్మాణానికి కూలీలు రాకుండా అడ్డుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. నీటిని నిలిపివేయడంతో సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రభోదానంద స్థిరపడ్డారు. ఆశ్రమంలో పౌర్ణమి, అమావాస్య నాడు జరిగే ప్రత్యేక బోధనల కోసం వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.

అనంతపురం జిల్లాలో ఆయనకు 25 వేల మంది భక్తులు ఉంటారని అంచనా. ఇందులో 15 వేల మంది తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన వారే. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభోదానందకు భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియాలో బోధనలు సాగుతున్నాయి. రెండేళ్లుగా ప్రభోదానంద ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వాటిని ఆశ్రమంలోని తెరలపై ప్రసారం చేస్తున్నారు.

జేసీ బ్రదర్స్‌తో వైరం తారస్థాయికి
జేసీ బ్రదర్స్‌ను గట్టిగా ఎదుర్కోవాలంటే రాజకీయ అండదండలు అవసరమని భావించిన ప్రభోదానంద కుమారులు జలంధర్‌ చౌదరి, యోగానంద చౌదరిలు గతేడాది ఏప్రిల్‌లో అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రభోదానందకు మణిందర్‌ చౌదరి అనే తనయుడు కూడా ఉన్నాడు. తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్మాణ సమయంలో ఇసుక సరఫరా కాకుండా అడ్డుకోవడంతో నిర్వాహకులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత తాడిపత్రి సమీపంలోని రావి వెంకటాపురంలో కమ్మ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి స్థానిక టీడీపీ నేత కాకర్ల రంగనాథ్‌ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని ఆహ్వానించారు. జలంధర్‌ చౌదరి కూడా దీనికి హాజరై కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చారు.

అంతకుముందు పరిటాల శ్రీరాంను కాకర్ల రంగనాథ్‌ తన నివాసంలో భోజనానికి ఆహ్వానించారు. ఈ ఘటనతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఏకమై జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ పరిణామంతో జేసీ బ్రదర్స్‌ ఆత్మరక్షణలో పడ్డారు. ఆశ్రమానికి సంబంధించి భక్తులు భారీ సంఖ్యలో ఉండటం, వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో గణేశ్‌ నిమజ్జనం ఘటనను అస్త్రంగా వాడుకున్నారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని ఓ ఆటోలో తీసుకెళ్లారు. వెనుక రెండు ట్రాక్టర్లలో రాళ్లు తరలించారు. ఆశ్రమం వద్ద జరిగిన గొడవ అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఎవరు ముందు దాడికి దిగారు? ఏం జరిగిందనేది కెమెరాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top