విద్యుత్ కోతలతో విలవిల | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోతలతో విలవిల

Published Sun, Oct 6 2013 4:47 AM

Power cuts problems

చౌటుప్పల్, న్యూస్‌లైన్: తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంతో సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ ప్రభావం విద్యుత్ రంగంపై పడింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెతో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఎన్టీటీపీఎస్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, లాంకో పవర్‌స్టేషన్‌లలో 3వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి శుక్రవారం నుంచి నిలిచిపోయింది. దాని ప్రభావం తెలంగాణ జిల్లాలపై పడింది.
 
 శుక్రవారం రాత్రి నుంచే ప్రభావం
 ఎన్‌టీటీపీఎస్ నుంచి సూర్యాపేటలోని సబ్‌స్టేషన్ ద్వారా హైదరాబాద్‌కు, నార్కట్‌పల్లి సబ్‌స్టేషన్ ద్వారా నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్, రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, శాలిగౌరారం తదితర మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రి నుంచే జిల్లాపై  ప్రభావం పడింది. శుక్రవారం రాత్రి కేవలం 2గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేశారు. శనివారం వ్యవసాయానికి అసలు విద్యుత్ ఇవ్వలేదు. గృహ సముదాయాలకు ఇదే పరిస్థితి. శనివారం ఉదయం 8గంటలకు సరఫరా నిలిచిపోయింది. తిరిగి రాత్రి 7గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచే సింగిల్ ఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా వచ్చిపోతోంది.  హైదరాబాద్‌లోని స్టేట్‌లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి సీమాంధ్రకు శనివారం 40మెగావాట్ల విద్యుత్‌ను నార్కట్‌పల్లి సబ్‌స్టేషన్ మీదుగా సరఫరా చేశారు.  ప్రస్తుతం వరి పెరిగే దశలో ఉంది. ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే నీరు లేక ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement