పౌల్ట్రీ..పల్టీ | poultry bussiness gets down | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ..పల్టీ

Oct 21 2013 3:54 AM | Updated on Sep 1 2017 11:49 PM

కాసులు కురిపించాల్సిన కోళ్లఫారాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనినే ఉపాధిగా ఎంచుకున్న ఎంతోమంది నిరుద్యోగులు కుదేలవుతున్నారు.

చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్ : కాసులు కురిపించాల్సిన కోళ్లఫారాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనినే ఉపాధిగా ఎంచుకున్న ఎంతోమంది నిరుద్యోగులు కుదేలవుతున్నారు. వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలి కోళ్లు చనిపోతుండగా... పెరుగుతున్న దాణావ్యయంతో గిట్టుబాటుకాక నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని పౌల్ట్రీలు మూతపడగా, తాజాగా మరికొన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి, లింగంగుంట్ల, కావూరు, యడవల్లి, మురికిపూడి తదితర గ్రామాల్లో 25 పౌల్ట్రీ ఫారాలను ఏర్పాటు చేశారు. రోజు రోజుకూ పెట్టుబడులు పెరిగిపోవటంతో ఆశించిన లాభాలు రావటం లేదని నిర్వాహకులు ఒక్కోఫారంలో నాలుగు మించి షెడ్లు ఉన్నా  ఒకటి, రెండు షెడ్లలోనే పెంపకం చేపడుతున్నారు.
 
 గిట్టుబాటు కాని ధరలు.. కోళ్ళ ఫారాల్లో వ్యాపారులు ఒక్కో కోడిపిల్లను రూ 24 కొనుగోలు చేసి తీసుకువస్తారు. వాటికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, నిత్యం వైద్య పర్యవేక్షణ చేపట్టి 45 రోజుల వరకూ పెంచుతారు. ఒక్కో కోడి పెంచి పోషించినందుకు  సరాసరిన రోజుకు రూపాయి చొప్పున రూ 45లు వెచ్చిస్తున్నారు. తీరా అమ్మకానికి వచ్చేసరికి అనుకూలమైన ధర లేకపోతోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ వ్యాపారులు కిలో ఒక్కంటికీ రూ 70 నుంచి రూ 74 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని దీనివల్ల పెట్టుబడులు సైతం రావడంలేదని వాపోతున్నారు.
 
 చుక్కల్లో దాణా ధరలు
 కోళ్ల బరువు పెరిగేందుకు వ్యాపారులు బలవర్థకమైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీటి ధర రోజు రోజుకూ పెరిగిపోవటంతో పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. కోళ్ళకు  నిత్యం అందించే దాణాలో నూనె తీసిన సోయా విత్తనాలు, మొక్కజొన్న పిండి తదితర వాటిని కలిపి ఒక బ్యాగ్(50 కేజీలు)ను రూ 2,100కు గతంలో విక్రయించేవారనీ, ఇప్పుడు వాటి ధర రూ 2,500 పలుకుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు. కోళ్ళ ఆరోగ్యం కోసం అందించే దాణా బస్తా గతంలో రూ 1300 ఉంటే ఇప్పుడది 1850కు చేరుకుందనీ, గతంలో రూ 28లు ఉండే  సోయా విత్తనాలు రూ 35కు, మొక్కజొన్నలు క్వింటా రూ 1200 నుంచి రూ 1500 పెరిగిందనీ, ఫలితంగా కోళ్ల పెంపకం భారంగా పరిణమిస్తోందని చెబుతున్నారు.
 
 పులిమీద పుట్రలా వ్యాధుల దాడి
 ఇన్ని వ్యయ, ప్రయాసలకోర్చి పెంచుతుంటే మరోవైపు వ్యాధులు విజృంభించి కొంతవరకూ కోళ్లను నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. వర్షాల ప్రభావంతో క్రానికల్ రెస్పిరేటర్ త్వరగా సంక్రమిస్తుందనీ, ఈ ప్రభావంతో నిరంతరం గురకపెట్టడం, గొంతులో నంజు వచ్చి శ్వాసనిలిచి మృతి చెందుతున్నాయని తెలిపారు.మరికొన్నింటికి లివర్, కిడ్నీవ్యాధులు సోకుతున్నాయని దీనివల్ల నష్టాలు పెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. కోడి పిల్లలను ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు, దాణాను సరఫరా చేసే సంస్థలు అనూహ్యంగా ధరలను పెంచటం, రోగాల బారిన కోళ్ళు మరణించటం, ఆశించిన మార్కెట్ ధరలు లేకపోవటంతో నష్టాల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి నెలకొందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రబుత్వం స్పందించి కోళ్ళ పెంపకందారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై దాణాను అందించాలని వారు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement