breaking news
poultry bussiness
-
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
పౌల్ట్రీ..పల్టీ
చిలకలూరిపేటరూరల్, న్యూస్‌లైన్ : కాసులు కురిపించాల్సిన కోళ్లఫారాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనినే ఉపాధిగా ఎంచుకున్న ఎంతోమంది నిరుద్యోగులు కుదేలవుతున్నారు. వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలి కోళ్లు చనిపోతుండగా... పెరుగుతున్న దాణావ్యయంతో గిట్టుబాటుకాక నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని పౌల్ట్రీలు మూతపడగా, తాజాగా మరికొన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి, లింగంగుంట్ల, కావూరు, యడవల్లి, మురికిపూడి తదితర గ్రామాల్లో 25 పౌల్ట్రీ ఫారాలను ఏర్పాటు చేశారు. రోజు రోజుకూ పెట్టుబడులు పెరిగిపోవటంతో ఆశించిన లాభాలు రావటం లేదని నిర్వాహకులు ఒక్కోఫారంలో నాలుగు మించి షెడ్లు ఉన్నా ఒకటి, రెండు షెడ్లలోనే పెంపకం చేపడుతున్నారు. గిట్టుబాటు కాని ధరలు.. కోళ్ళ ఫారాల్లో వ్యాపారులు ఒక్కో కోడిపిల్లను రూ 24 కొనుగోలు చేసి తీసుకువస్తారు. వాటికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, నిత్యం వైద్య పర్యవేక్షణ చేపట్టి 45 రోజుల వరకూ పెంచుతారు. ఒక్కో కోడి పెంచి పోషించినందుకు సరాసరిన రోజుకు రూపాయి చొప్పున రూ 45లు వెచ్చిస్తున్నారు. తీరా అమ్మకానికి వచ్చేసరికి అనుకూలమైన ధర లేకపోతోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రిటైల్ వ్యాపారులు కిలో ఒక్కంటికీ రూ 70 నుంచి రూ 74 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని దీనివల్ల పెట్టుబడులు సైతం రావడంలేదని వాపోతున్నారు. చుక్కల్లో దాణా ధరలు కోళ్ల బరువు పెరిగేందుకు వ్యాపారులు బలవర్థకమైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీటి ధర రోజు రోజుకూ పెరిగిపోవటంతో పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. కోళ్ళకు నిత్యం అందించే దాణాలో నూనె తీసిన సోయా విత్తనాలు, మొక్కజొన్న పిండి తదితర వాటిని కలిపి ఒక బ్యాగ్(50 కేజీలు)ను రూ 2,100కు గతంలో విక్రయించేవారనీ, ఇప్పుడు వాటి ధర రూ 2,500 పలుకుతోందని పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు. కోళ్ళ ఆరోగ్యం కోసం అందించే దాణా బస్తా గతంలో రూ 1300 ఉంటే ఇప్పుడది 1850కు చేరుకుందనీ, గతంలో రూ 28లు ఉండే సోయా విత్తనాలు రూ 35కు, మొక్కజొన్నలు క్వింటా రూ 1200 నుంచి రూ 1500 పెరిగిందనీ, ఫలితంగా కోళ్ల పెంపకం భారంగా పరిణమిస్తోందని చెబుతున్నారు. పులిమీద పుట్రలా వ్యాధుల దాడి ఇన్ని వ్యయ, ప్రయాసలకోర్చి పెంచుతుంటే మరోవైపు వ్యాధులు విజృంభించి కొంతవరకూ కోళ్లను నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. వర్షాల ప్రభావంతో క్రానికల్ రెస్పిరేటర్ త్వరగా సంక్రమిస్తుందనీ, ఈ ప్రభావంతో నిరంతరం గురకపెట్టడం, గొంతులో నంజు వచ్చి శ్వాసనిలిచి మృతి చెందుతున్నాయని తెలిపారు.మరికొన్నింటికి లివర్, కిడ్నీవ్యాధులు సోకుతున్నాయని దీనివల్ల నష్టాలు పెచ్చుమీరుతున్నాయని పేర్కొన్నారు. కోడి పిల్లలను ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు, దాణాను సరఫరా చేసే సంస్థలు అనూహ్యంగా ధరలను పెంచటం, రోగాల బారిన కోళ్ళు మరణించటం, ఆశించిన మార్కెట్ ధరలు లేకపోవటంతో నష్టాల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి నెలకొందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రబుత్వం స్పందించి కోళ్ళ పెంపకందారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై దాణాను అందించాలని వారు కోరుతున్నారు.