ఐటీడీఏలో సగం పోస్టులు ఖాళీ

Posts in ITDA Paderu Visakhapatnam - Sakshi

ఏళ్ల తరబడి జరగని భర్తీ  

కొత్త పోస్టుల మంజూరులో తాత్సారం

అర్హులైన గిరిజన అభ్యర్థులకు దక్కని ఉద్యోగాలు

విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రభావం

విశాఖపట్నం, పాడేరు: ఏజెన్సీలో గిరిజనాభివృద్ధికి మూలస్తంభంగా ఉన్న పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో సగానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గిరిజనాభివృద్ధికి కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన  శాఖల్లో ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1975లో ఐటీడీఏ ఏర్పడిన తరువాత ప్రధాన కార్యాలయ పరిపాలన విభాగానికి, వ్యవసాయ, ఉద్యాన వన విభాగాలకు మంజూరైన 86 పోస్టుల్లో ప్రస్తుతం 47 ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఐటీడీఏ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏవో),  స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టు  ఒకటి, డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు ఒకటి, డేటా ప్రాసెసింగ్‌ ఆపీసర్‌(డీపీవో పోస్టు) ఒకటి, సీనియర్‌ అకౌంటెంట్ల పోస్టులు– 2, సీనియర్‌ అసిస్టెంటు పోస్టులు–6, వ్యవసాయ అధికారి (ఏవో) పోస్టు–1, ఉద్యానవన అధికారులు(హెచ్‌వో పోస్టులు)–8, వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో పోస్టులు)–6, ఏఈవో పోస్టులు(కాఫీ)–2, టైపిస్టు పోస్టులు–4, డ్రైవర్‌ పోస్టులు–4, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు–4, వాచ్‌మెన్‌ పోస్టులు–2, స్టెనో టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్, మాలీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో అర్హులైన గిరిజన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదు. గిరిజన సంక్షేమశాఖ(విద్య)లోని పోస్టుల ఖాళీల భర్తీలోను ఏళ్ల తరబడి తాత్సారం జరుగుతోంది. ఏజెన్సీ 11 మండలాల్లో 122 ఆశ్రమ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో మంజూరైన 1997 టీచర్‌ పోస్టులకు గాను 181 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా 233 జీవో ప్రకారం ఈ పాఠశాలలకు కొత్తగా మంజూరైన 640 పోస్టులు భర్తీ చేయడానికి గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏజెన్సీ ఆశ్రమాల్లో 821 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉంటే, ఏటా ప్రభుత్వం 534 మంది సీఆర్టీలను   నియమిస్తూ పాఠశాలలను నిర్వహిస్తోంది. 87 హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టులకు 36 ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్లుగా కొనసాగుతున్నారు. ఏజెన్సీలో కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులను కూడా అదనంగా మంజూరు చేయాల్సి ఉంది. ఆశ్రమ వసతిగృహాల్లో కూడా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. 545 నాల్గోతరగతి ఉద్యోగుల పోస్టులకు గాను 338 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఔట్‌ సోర్సింగ్‌పై 248 మంది వర్కర్లను నియమించి వసతిగృహాలను నిర్వహిస్తున్నారు. 122 ఆశ్రమ వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి 743 క్లాస్‌–4 ఉద్యోగులుండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్‌ కలిపి 455 మంది మాత్రమే. గిరిజన సంక్షేమశాఖలో వివిధ కేటగిరీల్లోకొత్తగా ఈ పోస్టులు మంజూరులోనూ తాత్సారం నెలకొంది. ఏజెన్సీలో వైద్య,ఆరోగ్యశాఖలోనూ 7,082 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌(ఎంపీహెచ్‌ఏ–మేల్‌), సెకండ్‌ ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్టు, పోస్టుల్లోనూ అధికశాతం మంది గిరిజన అభ్యర్థులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. ఏజెన్సీలో ప్రధానమైన ఈ శాఖల్లో పోస్టులు భర్తీకాక ఉద్యోగావకాశాలు లభించక గిరిజన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top