కాశీ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగానే.. కటకటాల్లోకి..!

Police Have Arrested A Man For Murdering His Wife In Chirala - Sakshi

వ్యసనాలకు బానిసై మాజీ భార్యను కడతేర్చిన కేసులో..

రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు

కాశీ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా వలపన్ని పట్టుకున్న పోలీసులు 

సాక్షి, చీరాల రూరల్‌: ఓ వ్యక్తి వ్యసనాలకు బానిసై అందిన కాడికి అప్పులు చేసి జులాయిగా తిరుగుతూ ఇంటిని కూడా విక్రయించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మాజీ భార్యను కర్రతో మోది హత్య చేశాడు. ఆమె మాజీ భర్తను ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. చీరాల రూరల్‌ మండలం తోటవారిపాలెం పంచాయతీ బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన నీలం కృష్ణమూర్తి, ఆదిలక్ష్మి (39) భార్యాభర్తలు. వీరికి 1996లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణమూర్తి పదేళ్లుగా మద్యానికి, పేకాటకు బానిసయ్యాడు. ఇంట్లో జరగడం లేదని, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఎలాగని భర్తను ఆదిలక్ష్మి ప్రశ్నిస్తుండేది. కృష్ణమూర్తి ఇంట్లోకి డబ్బులు ఇవ్వకపోగా కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భర్త బాధలు భరించలేని ఆమె 2011లో ఈపురుపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు కూడా పెట్టింది.

పోలీసులు కృష్ణమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపారు. జైలు నుంచి వచ్చిన అతడిని అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయసాగారు. ఏం చేయాలో పాలుపోని అతడు ఉన్న ఇంటిని తెగనమ్మేందుకు సాహసించాడు. ఇందుకు భార్య అడ్డుపడింది. ఉన్న ఇంటిని అమ్మితే నడిరోడ్డుపై ఉండాల్సి వస్తుందని, కుటుంబం పరువు బజారున పడుతుందని వేడుకుంది. ఇరువర్గాలకు చెందిన పెద్దలు రాజీ కుదిర్చారు. అయినా ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఆదిలక్ష్మి 10 నెలలుగా అతడికి దూరంగా ఉంటోంది. తనకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేసి భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఆదిలక్ష్మిపై పగ పెంచుకున్న కృష్ణమూర్తి ఎలాగైన ఆమెను చంపుతానని తనకు తెలిసిన వారికి చెబుతూ తిరుగుతున్నాడు. సరైన అదను కోసం ఎదురు చూస్తుçన్న అతడు ఈ ఏడాది ఆగస్టు 25న సాయంత్రం ఏడు గంటల సమయంలో కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు.

తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రురాలిని స్థానికులు, ఆమె బంధువులు చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె అదే నెల 30వ తేదీన మృతి చెందింది. పోలీసులు మొదట కొట్లాట కేసుగా నమోదు చేసి ఆమె మరణానంతరం హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం వేట కొనసాగించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, రూరల్‌ సీఐ జె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అనేక వేషధారణల్లో నిందితుడు 
నిందితుడు తప్పించుకునేందుకు అనేక వేషధారణల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారనే సమాచారం తెలుసుకున్న కృష్ణమూర్తి గుండు గీయించుకుని అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. కొంతకాలం తనకు తెలిసిన వారి వద్ద పొడుగుల పని చేశాడు. చేతిలోకి కొంత డబ్బులు వచ్చాక తిరిగి మరొక చోటికి మారేవాడు. మరికొంత కాలం బేల్దారి పనులకు వెళ్లేవాడు. ఇలా పోలీసులకు చిక్కకుండా సుమారు రెండు నెలలు పాటు తిరిగాడు. చివరికి అతడు ప్రముఖ పుణ్య క్షేత్రం కాశీ వెళ్లేందుకు సమాయత్తమై తన స్వగ్రామానికి దగ్గరగా ఉన్న గుంటూరు జిల్లా స్టూవర్టుపురం చేరుకున్నాడు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఈపురుపాలెం ఎస్‌ఐ సుధాకర్, హెడ్‌కానిస్టేబుల్‌ కుంభా శ్రీను, కానిస్టేబుళ్లు విజయ్‌కృష్ణ, నజీర్, హోంగార్డు రవూఫ్‌లు నిందితుడు కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top