అధికార పార్టీకి తొత్తుగా పోలీసు వ్యవస్థ

Police department under the control of TDP - Sakshi

విలేకరుల సమావేశంలో మాజీమంత్రి బాలినేని, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  

ఒంగోలు: తమ పార్టీ కార్యాలయ ప్రారంభానికి ముందస్తు అనుమతులు ఇచ్చి కూడా అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ వెంట వేలాదిమంది కార్యకర్తలు ఉంటే కేవలం వంద మంది కూడా లేని టీడీపీ నాయకులను బూచిగా చూపించి ప్రజాస్వామ్య హక్కును కాలరాసేలా పోలీసుశాఖ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం కాదని, నేరుగా ఎదుర్కొనేందుకు ముందుకు రావాలని టీడీపీ నేత జనార్దన్‌కు సవాల్‌ విసురుతున్నానన్నారు.

ఒంగోలులో జరిగిన ఘటనతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఎంతలా కొమ్ముకాస్తోందో తెలుస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేను బస్సులో కింద కూర్చోబెట్టి రాత్రంతా తమిళనాడులో తిప్పి తెల్లవారుఝామున అనారోగ్యానికి గురైనా పట్టించుకోకుండా సత్యవేడు పోలీసుస్టేషన్‌లో వదిలారన్నారు. దీనిపై చిత్తూరు ఎస్పీ ఇస్తున్న సమాధానం సరిగా లేదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారు.

శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర పోలీసులు వివక్ష ప్రదర్శిస్తున్నారని, దీనిపై గవర్నర్‌కు కూడా రాతపూర్వకంగా తెలియజేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top