ఆ చేపల్ని తింటే ఇక అంతే సంగతులు | poisoned fish found in Visakhapatnam beach | Sakshi
Sakshi News home page

ఆ చేపల్ని తింటే ఇక అంతే సంగతులు

Aug 9 2017 8:53 AM | Updated on Sep 18 2018 7:36 PM

విశాఖ తీరంలో విషపు చేపల ఉనికి వెల్లడయింది.

  • విశాఖతీరంలో విష మత్స్యాలు
  • తింటే చనిపోతారంటున్న శాస్త్రవేత్తలు
  • పరిశోధనలతో వెలుగులోకి   


  • సాక్షి, విశాఖపట్నం: విశాఖ తీరంలో విషపు చేపల ఉనికి వెల్లడయింది. వీటిని తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దేశంలోని తూర్పు తీరంలోకెల్లా ఒక్క విశాఖలోనే అత్యంత అరుదైన షార్ప్‌టైల్‌ మోలా రకం చేప ఉన్నట్టు పరిశోధకుల పరిశీలనలో తేలింది. దీనిని సన్‌ఫిష్‌గాను, పఫర్‌ ఫిష్‌గా కూడా వ్యవహరిస్తారు. స్థానిక మత్స్యకారులు కప్ప చేపగా పిలుస్తారు. అర్ధచంద్రాకారంలో సుమారు 40–45 కిలోల బరువు, 1.4 మీటర్ల పొడవు ఉండే ఈ చేపలు తినేందుకు పనికిరావు. వీటిలో విషపూరితమైన సఫర్‌ పాయిజన్‌ గ్రంధులు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెట్రాడోటాక్సిన్‌ అనే విషాన్ని విడుదలచేస్తాయి. వీటిని తింటే వాంతులవడంతోపాటు, పక్షవాతానికి గురై మరణిస్తారు కూడా.

    ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్‌ లివింగ్‌ రిసోర్సెస్‌ (ఎంఎల్‌ఆర్‌) విభాగం పూర్వ అధిపతి ప్రొఫెసర్‌ దేవర వేణు, సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫిషింగ్‌ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ)లో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో డాక్టర్‌ ఎన్‌ఎం కృష్ణ, ఆదికవి నన్నయ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వి.గోవిందరావు సముద్రంలో అరుదైన కొత్త జాతులు, అంతరించిపోతున్న మత్స్యసంపదపై పరిశోధనలు చేశారు. పరిశోధనల్లో ఇటీవల విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ పరిసరాల్లో ఈ కప్ప చేప (షార్ప్‌టైల్‌ మోలా) లభ్యమైంది. దీని ముక్కు చిలక ముక్కును పోలి ఉంటుంది. నోరు డైమండ్‌ ఆకారంలో ఉంటుంది. రెండు పళ్లు ఉంటాయి. ప్రపంచం మొత్తమ్మీద ఇలాంటి జాతి చేపలు 4 రకాలే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

    ఈ షార్ప్‌టైల్‌ చేపకు దగ్గర పోలికలున్న మరో రకం చేప పశ్చిమ తీరంలో ఉన్నట్టు ఇదివరకు గుర్తించారు. కానీ దానికి తోక మాత్రం ఉండదు. దీనిని శాస్త్రీయ పరిభాషలో మోలామోలాగా పిలుస్తారు. కాగా కప్ప చేపలు విషపూరితమని స్థానిక మత్స్యకారులకు తెలుసు. వీటిని తినడం ప్రాణాంతకమన్న విషయంపై అవగాహన కల్పించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement