రోజూ పెట్రో వాతలే!

Petrol Price Increase Daily In AP - Sakshi

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయనే నెపంతో కేంద్రం ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుతోంది. క్రూడాయిల్‌ ధరలకు తోడు రూపాయి మారక విలువ పడిపోతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారుతోంది. పెట్రో ధరల పెరుగుదల అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్షానికోసారి పెట్రో ధరలను సమీక్షించేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజు వారి సమీక్షకు తెరతీసింది. కొన్ని సందర్భాల్లో మినహా ధరలు తగ్గిన సందర్భం లేదు. ప్రస్తుతం పెట్రోలు రూ.85లకు చేరుకుంది. ఇలాగే పెరుగుతూ పోతే మరో మూడు నెలల్లో రూ.వంద చేరకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతర్జాతీయంగా ముడిఇంధన ధరలు పెరుగుతున్నాయని, రూపాయి మారక విలువ పడిపోతుండటంతో ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయని ఇంధన కంపెనీలు పేర్కొంటున్నాయి.  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణభూతమవుతోంది. తామెలా బతకాలని చిరుద్యోగులు, ఆటో వాలాలు, వాహనాల యజమానులు వాపోతున్నారు.
  
పన్నుల మోత...: కొత్త విధానంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నారు. మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నారు. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ.6.50 , తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 తక్కువగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్‌ రూపంలో 28శాతం పన్ను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెట్రో ధరలు ఇక్కడ మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపం లో దాదాపు రూ.28 వరకు చెల్లించాల్సి వస్తోంది.

అందులో ఏపీ వ్యాట్‌ రూ.6 నుంచి 8వరకు ఉంటోంది. 
ఎక్సైజ్‌ సుంకం తగ్గినా..: ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర 74 డాలర్లుగా ఉంది. చమురు సంస్థలు రోజూ 20 పైసల వరకు  మార్పులు, చేర్పు లు చేస్తూ వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెంచిన ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరకు రూ.2 తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ రేటు తగ్గించాలని సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గించినా రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్‌ వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతోంది. 

ధరలు భరించలేం 
తమిళనాడు, కర్ణాటకతో పోలి స్తే రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతూ పోతే భరించడం కష్టం. 
– కృష్ణమోహన్, ప్రభుత్వ ఉద్యోగి 

ధరలను నియంత్రించాలి 
పెట్రోల్‌ ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. రోజువారి ధరల మార్పుతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది. పదిహేను రోజులకోసారి ధర నిర్ణయించాలి. – రమణ, ఉపాధ్యాయుడు, కర్నూలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top