రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ సింహపురి వాసులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరుసగా 69వ రోజూ జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించారు.
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ సింహపురి వాసులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరుసగా 69వ రోజూ జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాస్తారోకోలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించారు. విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించి పగలంతా విద్యుత్ సరఫరా నిలిపేశారు. నెల్లూరులో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి కోవూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు రక్తదానం చేశారు. ఆర్డీఓ కార్యాలయం సెం టర్‌లో ఉపాధ్యాయులు రిలేదీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల విధులను అడ్డుకున్నారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే బల్లిదుర్గా ప్రసాద్‌రావుకు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యు డు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సమన్వయకర్త బాలచెన్నయ్య, పట్టణ కన్వీనర్ నాగులు తదతరులు సంఘీభావం తెలిపారు. చిట్టమూరు మండలం పిట్టివానిపాళెంలోని విద్యార్థులు నాయుడుపేట-మల్లాం రోడ్డుపై బైఠాయించారు. వైఎస్ జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి దంపతులు రెండో రోజూ రిలేదీక్ష చేశారు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో వరికుంటపాడు మండల నేతలు కూర్చున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. దుత్తలూరు, సీతారాంపురం, వింజమూరు, కలిగిరి మండలాల్లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. సూళ్లూరుపేట జేఏసీ నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మన్నారుపోలూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. షార్ కేంద్రం, రైల్వేలైను, పారిశ్రామిక వాడలు, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా బుచ్చిరెడ్డిపాళెంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి రిలేదీక్ష చేశారు. కోవూరులో చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు.