
ముందుకెళ్తే మెరుపు సమ్మె
రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్తే మెరుపు సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్తే మెరుపు సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. తాము సమ్మెను తాత్కాలికంగానే విరమించామని, దీన్ని అలుసుగా తీసుకుంటే తగినవిధంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. జేఏసీ ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలోకి తెచ్చి హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆయనను కోరారు.
రాష్ట్ర విభజన నెపంతో ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో వేలాది ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం నిలిపివేయడం సమంజసం కాదన్నారు. ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, అలాగే వారంలోగా విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అనంతరం ఆయా విషయాలను జేఏసీ నేతలు శ్రీనివాసరావు, సాయిబాబా మీడియాకు వెల్లడించారు.