పండగ ప్రయాణమెలా!

People Worried About Sankranti Festival Journey - Sakshi

సంక్రాంతిప్రయాణానికి వెళ్లేదారిలేక ప్రయాణికులుఆందోళన

ఇప్పటికే పూర్తయినరైళ్ల రిజర్వేషన్‌

అదనపు బోగీలపై రాని స్పష్టత

అన్ని రైళ్లకు జనవరి నెలాఖరు వరకూ చాంతా డులా వెయిటింగ్‌ లిస్టు

చార్జీల మోతకు సిద్ధపడుతున్న బస్సులు

సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. సొంత పల్లెలో కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు, డూడూ బవసన్నల నృత్యాలు,గంగరెద్దులలోళ్ల సన్నాయి మేళాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణపాట్లు తప్పేలా లేవు.నెలరోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్‌  పూర్తికావడం, రిగ్రెట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్‌తోప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్‌ అదనపు చార్జీలు మోత మోగిస్తుండటంతోప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. రైల్వే శాఖ ఆధీనంలోని  ఆర్‌సీటీసీ రైళ్లలో సైతం ప్రత్యేక బాదుడుఉండటంతో ప్రయాణికులకు
సంకాంతి ప్రయాణంభారమైంది. 

రాజంపేట/కడప కోటిరెడ్డి సర్కిల్‌ : దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపిస్తారు. నవంబరు నుంచి చాలామంది ఈదిశగా ప్రయత్నించడంతో రిజర్వేషన్లన్నీ ఫుల్లయిపోయాయి. కొన్ని రైళ్లకు రిగ్రెట్‌(టికెట్‌ రావడం లేదు) వచ్చేస్తోంది. దీంతో ఏం చేయాలో ప్రయాణికులకు పాలుపోవడం లేదు. తత్కాల్‌పై ఆధారపడదామంటే అది కాస్తా లైన్లు జామ్‌ అయి కొద్దిమందికే పరిమితమవుతోంది.  ప్రస్తుతం కడప నుంచి హైదరాబాదుకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 80, రాయలసీమలో 70, చెన్నై–మంబయి దాదర్‌లో 80, చెన్నై–ఎగ్మోర్‌లో 40, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో 100, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌పెస్‌లో 120, కన్యాకుమారి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో 100కు పైగా, చెన్నై–ముంబయి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 90కి పైగా వెయిటింగ్‌ లిస్టు కొనసాగుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి.ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కడప మీదుగా రాకపోకలు సాగించేందుకు కొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రజలు కోరుతున్నారు. పండగనగానే సొంతూళ్లకు చేరుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.కానీ ఎలా చేరుకోవాలో అర్ధం కావడం లేదని రాజంపేటకు వెంకట రమణమూర్తి వాపోయారు. ఈయన కాకినాడ వెళ్లాల్సి ఉంది.  

అదనపుబోగీలు డౌటే..
సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణీకులు రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటి వరకు అదనపు బోగీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రయాణీకులు ఆశలు వదలుకున్నారు. రెండేళ్ల కిందట ప్రత్యేక రైళ్లు నడిపి అదనంగా వసూలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రయాణీకులు గుర్తు చేసుకుంటూ , ప్రీమియం రైళ్లలో రోజురోజుకూ టికెట్‌ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సరికదా ఆర్టీసీ బస్సులో వెళ్దామంటే సంబంధిత అధికారులు రిజర్వేషన్‌ సైట్లను నిలిపివేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అదనపు చార్జీలు మోత తప్పడంలేదు. సాధారణ రోజుల్లో రైల్వే చార్జీలు కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువ. పండగ రోజుల్లో డిమాండ్‌ బట్టి రేట్లు పెంచేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 30శాతం వరకు రేట్లను పెంచేసిన యాజమాన్యాలు సంక్రాంతి తర్వాత వారం రోజులపాటు టికెట్‌ ధరపై వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. 

ఏటా దోపిడే..
ఏటా ప్రయాణీకులను ప్రైవేటు, రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. మరో వైపు ఉద్యోగులకు, ఉపాధ్యాయులలకు సంక్రాంతి సెలవులపై స్పష్టత రాకపోవడంతో రిజర్వేషన్‌పై వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ కావాలన్న దొరక్కపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ చుట్టూ తిరుగుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top