టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు | people will answer to tdp leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు

Jun 5 2015 3:04 AM | Updated on Oct 9 2018 2:51 PM

టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు - Sakshi

టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు

మన్యంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి కలిసిరాకపోతే తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మావోయిస్టు నేతలు హెచ్చరించారు...

- బాక్సైట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల సమావేశం
- ఉద్యమాల్లో కలిసిరావాలని ప్రజాప్రతినిధులకు పిలుపు
చింతపల్లి:
మన్యంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి కలిసిరాకపోతే  తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మావోయిస్టు నేతలు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం జీకేవీధి మండలం మారుమూల ప్రాంతంలో కొందరు ప్రజా ప్రతినిధులతో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొన్నేళ్లుగా గిరిజనులు అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజాభీష్టానికి మద్దతుగా తాము కూడా ఖనిజ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాము, బాక్సైట్ తవ్వకాల వల్ల వేలాది మంది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులవుతారు.

గిరిజనుల ఓట్లతో పదవులు పొందిన నాయకులంతా వారి అభీష్టం మేరకు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించినట్లు తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని నీతులు వల్లించిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తవ్వకాలు చేపడతామంటే మౌనంగా ఉండటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించినట్లు తెలిసింది. ఏజెన్సీలోని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతిని దులు ప్రజలకు మద్దతుగా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాల్లో తప్పకుండా పాల్గొనాలని, తవ్వకాలు నిలిపివేసేందుకు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెట్టే బాధ్యత కూడా స్థానిక నేతలే తీసుకోవాలని దళసభ్యులు సూచించినట్లు తెలిసింది.

పార్టీకు, పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమాలు చేయాలని, ప్రజల మద్దతు కోసం మొక్కుబడిగా ర్యాలీలు, ధర్నాలలో పాల్గొంటే తాము సహించమని హెచ్చరించి నట్లు తెలిసింది. అన్ని గ్రామాలలో నేతలపై ప్రజలే ఒత్తిడి తీసుకు వస్తారని, ఇతర రాజకీయపార్టీలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో ఉద్యమాలు చేయాలని సూచించినట్లు తెలిసింది. మావోయిస్టుల హెచ్చరికలతో టీడీ పీనేతల గుండెల్లో గుబులు చోటు చేసుకుంది. ఇప్పటికే కొంత మంది అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement