పాతపట్నం.. కొత్తరూటు | Sakshi
Sakshi News home page

పాతపట్నం.. కొత్తరూటు

Published Fri, Mar 29 2019 4:08 PM

Pathapatnam Constituency Review - Sakshi

సాక్షి, ఎల్‌ ఎన్‌ పేట, (శ్రీకాకుళం): పాతపట్నం.. జిల్లాలో అత్యంత చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతం. వరాహ వెంకట గిరిని జాతికి అందించిన గడ్డ ఇది. ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన లుకలాపు లక్ష్మ ణదాస్‌ రాజకీయ ఓనమాలు దిద్దిందీ ఇక్కడే. చంద్రబాబు తన అనుచర గణాన్ని అంతా దింపినా లక్ష్మీపార్వతిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రాంతమిది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇతర పార్టీలూ ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే. గత ఎన్నికల్లో స్థానిక ఓటర్లు వైఎస్సార్‌సీపీకి పట్టం కడితే.. వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కేస్తూ కలమట వెంకటరమణ టీడీపీకి ఫిరాయించారు. ఈ అంశమే ప్రస్తుత ఎన్నికల ఫలితాలను డిసైడ్‌ చేయబోతోందని స్థానికులంటున్నారు.

అపురూప చరిత్ర..
పాతపట్నం నియోజకవర్గం 1952 నుంచి యాక్టివ్‌గా ఉంది. అప్పట్లో ద్విసభ్య శాసనసభగా ఉండేది. లుకలాపు లక్ష్మణదాస్, వీవీ గిరి నుంచి నేటి కలమట వెంకటరమణ వరకు దాదాపు పద్దెనిమిది మంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మొదట్లో కాంగ్రెస్‌పై అభిమానం చూపిన నియోజకవర్గ ప్రజలు అనంతరం ఎన్టీఆర్‌పై అపార ప్రేమ చూపించారు. వెన్నుపోటు ఎపిసోడ్‌ తర్వాత కూడా ఇక్కడి ప్రజలు ఎన్టీఆర్‌వైపే నిలబడ్డారు. అందుకు నందమూరి లక్ష్మీపార్వతి గెలుపే నిదర్శనం. ఎన్టీఆర్‌ తర్వాత వైఎస్సార్‌పైనే ఇక్కడి వారు మళ్లీ అంతటి ప్రేమ చూపించారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన శత్రుచర్ల విజయరామరాజు గెలుపొందగా, 2014లో కలమట వెంకటరమణ వైఎస్సార్‌ జెండా పట్టుకుని గెలుపొందారు. అయితే ఆయన ఆ జెండాను దింపేసి టీడీపీ జెండాను నెత్తినెత్తుకున్నారు. రాజీనామా చేయకుండానే టీడీపీలోకి ఫిరాయించి జనాభిప్రాయాన్ని కించపరిచారు.

మొత్తం ఓటర్లు: 2,16,221
పురుషులు: 1,08,606
మహిళలు: 1,07,594
ఇతరులు:  17
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు :  316 

ప్రధాన సమస్యలు..

అభివృద్ధికి నోచుకోని వంశధార నిర్వాసితుల పునరావాస కాలనీ  

వంశధార నిర్వాసితులదే ఇక్కడి ప్రధాన సమస్య. వైఎస్‌ హయాంలో ప్రాజెక్టు పనులు సజావుగా జరిగి, ప్యాకేజీలు, పునరావాలు కూడా ఎలాం టి గొడవలు లేకుండా జరిగాయి. కానీ టీడీపీ అధికారం చేపట్టాక ఈ పనుల్లో గందరగోళం మొదలైంది. పునరావాస ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీరు లేదు. ఇళ్లు లేవు. వారికి రేషన్లు, పింఛన్లు, ఓట్లు చాలా సదుపాయాలు మృగ్యమైపోయాయి. వీటిపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధికార పార్టీ పంచన చేరారు. దీంతో పాటు గిరిజన ప్రాంతం కూడా ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. 

విశిష్టతలు
పాతపట్నం నుంచే రాజకీయ ఓనమాలు దిద్దిన వి.వి.గిరి (వరాహ వెంకట గిరి) కేంద్ర కార్మిక మంత్రి, భారత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు. 
పాతపట్నం నుంచి గెలిచిన లుకలాపు లక్ష్మణదాస్‌ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నేతగా వెలుగొందారు. 
1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ కృష్ణుడి వేషధారణలో ఉన్న కటౌట్‌ను ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్నందున టీడీపీ నుంచి గెలిచిన కలమట మోహనరావు ఎన్నికల చెల్లదంటూ అప్పటి ప్రత్యర్థి ధర్మాన నారాయణరావు (కాంగ్రెస్‌) కోర్టుకు వెళ్లడంతో 1996లో కలమట ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. 
1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కలమట మోహనరావు సతీమణి వేణమ్మపై ఎన్టీఆర్‌ టీడీపీ తరఫున పోటీ చేసిన నందమూరి లక్ష్మీపార్వతి ఘన విజయం సాధించారు. లక్ష్మీపార్వతి విజయాన్ని అడ్డుకునేందుకు అప్ప టి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గాన్ని అంతా దించినా నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించి లక్ష్మీపార్వతి ఎన్నికయ్యారు.

కలమట కోటకు బీటలు 
1978 నుంచి కలమట కుటుంబానికి కంచుకోటగా మారిన పాతపట్నం నియోజకవర్గంలో కలమట మోహనరావు ఐదు సార్లు, ఆయన కొడుకు కలమట వెంకటరమణమూర్తి ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఆ కోటకు బీటలు పడనున్నట్లు తార్కాణాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి 2016లో అధికార టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను ఓడించాలనే ధ్యేయంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 2016 నుంచి రాత్రి పగలు, కొండలు, నదులు అనే తేడా లేకుండా పల్లెపల్లెకు, గడప గడపకూ తిరిగారు. అన్ని వర్గాల వారితో కష్టసుఖాలు పంచుకున్నారు. దీనికి తోడు ఇసుక అక్రమ రవాణాలో కలమట అక్రమాలు జనాలకు తెలిసిపోయాయి. ఇవే ప్రస్తుత ఎలక్షన్లను ప్రభావితం చేయనున్నాయి.

1/1

రెడ్డి శాంతి (వైఎస్సార్‌ సీపీ), కలమట వెంకటరమణ (టీడీపీ)

Advertisement
 
Advertisement