అదిగో పులి..ఇదిగో తోక! | Parthi And Bihar Gang Spread In Social Media Guntur | Sakshi
Sakshi News home page

అదిగో పులి..ఇదిగో తోక!

May 28 2018 10:51 AM | Updated on Oct 22 2018 6:10 PM

Parthi And Bihar Gang Spread In Social Media Guntur - Sakshi

వెంగళాయపాలెంలో కిడ్నాపర్‌ అన్న అనుమానంతో మతిస్థిమితం లేని వృద్ధురాలిని చెట్టుకు కట్టేసిన దృశ్యం

సాక్షి, గుంటూరు: జిల్లాలో పార్థి గ్యాంగ్, కిడ్నాపర్లు తిరుగుతున్నారన్న వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొత్తవారు ఎవరైనా కొంచెం అనుమానంగా కనిపిస్తే దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య సమాచారం కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. రాత్రిళ్లు భయంతో గ్రామాల్లో గస్తీ కాసే దుస్థితిని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి ‘అదుగో పులి అంటే.. ఇదిగో తోక’ అన్న చందంగా ఉంది. అప్రమత్తమైన పోలీసులు ప్రజలకుఅవగాహన కల్పిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.

అసత్య పోస్టింగ్‌లు పెడితే జైలుకే..
ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పార్థి గ్యాంగ్, చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపింగ్‌ ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయనే తప్పుడు పోస్టింగ్‌లు విస్తృతంగా వ్యాపించాయి. వీరు పగటిపూట మతిస్థిమితం లేనివారిగా నటిస్తూ గ్రామాల్లో రెక్కీ నిర్వహిస్తారని, రాత్రి వేళల్లో ఇళ్లపై దాడులు చేస్తారంటూ ఎక్కువగా పోస్టింగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల కూడా గుర్తించారు. ఇటువంటి పోస్ట్‌లు పెట్టినా, అమాయకులను పట్టుకుని దాడికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వారం రోజుల కిందట నూజెండ్ల మండలం పాతఉప్పలపాడు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని గ్రామస్తులు పట్టుకుని కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. పూర్తిగా విచారించిన అనంతరం మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించిన అతన్ని వదిలేశారు. అదే మండలం జంగాలపల్లి గ్రామం వెళ్లిన సదరు వ్యక్తిని మళ్లీ అక్కడి గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. ఏం చేయాలో తెలియని పోలీసులు అతన్ని ట్రైన్‌లో ప్రకాశం జిల్లా వెల్లల చెరువుకు  పంపించేశారు.
ఈ నెల 23న రేపల్లె రైల్వే స్టేషన్‌లో కూర్చుని ఉన్న మతిస్థిమితం లేని ఓ యువతిని కిడ్నాపర్‌గా అనుమానించి కొందరు యువకులు కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
రెండు రోజుల కిందట ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మరికొందరు కొండపైన తిరుగుతున్నారనే వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు రాత్రంతా కర్రలు పట్టుకుని గస్తీ కాశారు.
∙గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామంలో శుక్ర, శనివారాల్లో రాత్రి పూట వందల మంది యువకులు కర్రలు పట్టుకుని రాత్రి పూట కాపలా కాస్తున్నారు. ఆదివారం ఉదయం గ్రామంలో మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలిని పట్టుకుని కొందరు చెట్టుకు కట్టేసి కొట్టారు.

ఎవ్వరినీ కొట్టొద్దు..
ఎవరైనా అనుమానం కనిపించినా, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. కొంత మంది మతిస్థిమితం లేకపోవడంతో పాటు, భాష రాకపోవడంతో సమాధానం చెప్పలేక ఊరకుండిపోతున్నారని, అటువంటి వారిపై దాడులు చేయొద్దంటున్నారు.

గ్రామాల్లో గస్తీ..
జిల్లాలో బూచోళ్లు తిరుగుతున్నారనే భయంతో పలు గ్రామాల్లో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యువకులు అయితే రాత్రిళ్లు కర్రలు పట్టుకుని గ్రామం మొత్తం తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. కొత్త వ్యక్తులు, మతిస్థితిమితం లేని వారిని అనుమానిస్తూ చితకబాదుతున్నారు. గుంటూరు నగరంలోని న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో సైతం వారం రోజుల కిందట కిడ్నాపర్ల వచ్చారన్న వదంతులతో ఆ ప్రాంతానికి చెందిన యువకులు రాత్రి వేళల్లో కాపలా కాశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  కొన్ని చోట్ల అయితే రాత్రి గస్తీ తిరిగే పోలీసు కానిస్టేబుళ్లు యువకులను వెంటబెట్టుకుని గస్తీ కాస్తున్నట్టు సమాచారం. పార్థి గ్యాంగ్‌ లేదని, ముఠానాయకుడు ఎప్పుడో చనిపోయాడని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య ప్రకటించినప్పటికీ వదంతులు మాత్రం ఆగడం లేదు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించం..
జిల్లాలో పార్థి గ్యాంగ్, కిడ్నాప్‌ ముఠాల జాడ లేదని జిల్లా అర్బన్, రూరల్‌ ఎస్పీలు ధ్రువీకరించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని వారిపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. ప్రజలు సైతం అనుమానాలు, అపోహలతో అమాయకులపై దాడులకు పాల్పడొద్దని చెబుతున్నారు.  అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలిని,  చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement