కరెంటోళ్లు ఖాళీ!
విద్యుత్ శాఖలో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నవారిపై అదనపు బాధ్యతలు మీద పడడంతో క్షేత్రస్థారుులో పనుల పర్యవేక్షణ కొరవడింది.
- సిబ్బంది అవతారమెత్తుతున్న రైతులు
- మేడారం పనులపైనా ప్రభావం
హన్మకొండ, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖలో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నవారిపై అదనపు బాధ్యతలు మీద పడడంతో క్షేత్రస్థారుులో పనుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితి ఎలాగోలా గడిచిపోతున్నా... రూరల్ ప్రాంతంలో మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా రైతులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పంట పొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రైతులే కరెంట్ సిబ్బంది అవతారం ఎత్తక తప్పడం లేదు. కిందిస్థాయిలో లైన్‌మన్లు లేకపోవడంతో.. సమస్యలు తలెత్తితే ఎవరికి చెప్పుకోవాలో రైతులకు తెలియడం లేదు.
మేడారం మహా జాతర పనులకు ఏఈలు, సబ్ ఇంజినీర్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లను డిప్యూటేషన్‌పై వేసేందుకు ఉన్నతాధికారులు జంకుతున్నారంటే పరిస్థితి ఏంటో గ్రహించవచ్చు. ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి అనుమతి రాకపోవడంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. విద్యుత్ సమస్యల పరి ష్కారంలో ప్రధానంగా ఏఈలు, సబ్ ఇంజినీర్లు, లైన్‌మన్లు, జేఎల్‌ఎంలదే కీలక పాత్ర. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలన్నా, స్తంభాలు వేయాలన్నా, తీగ లాగాలన్నా వారు ఉండాల్సిందే. కానీ... 24 సెక్షన్లలో ఏఈలు లేరు. గ్రామాల్లో కీలకమైన అసిస్టెంట్ లైన్‌మన్, జేఎల్‌ఎం పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
ఎక్కడెక్కడ ఏఈలు లేరంటే...
ఏటూరునాగారం, ములుగు, లక్ష్మీదేవిపేట (వెంకటాపూర్), పాలకుర్తి రూరల్, మొగుళ్లపల్లి, రామకృష్ణాపూర్ (చిట్యాల), ధర్మసాగర్, పాలకుర్తి, లింగాల ఘణపురం, చేర్యాల టౌన్, మద్దూర్, వరంగల్ అర్బన్ (మట్టెవాడ), ఆత్మకూరు, మచ్చాపూర్, సంగెం, పర్వతగిరి, మైలారం, నర్సంపేట టౌన్, ఖానాపూర్, మహబూబాబాద్ రూరల్, డోర్నకల్, దంతాలపల్లి (నర్సింహులపేట), తొర్రూరు రూరల్, నెల్లికుదురు సబ్‌స్టేషన్ల పరిధిలో ఏఈలు లేరు. ఇవిగాక మిగతా పోస్టుల్లో పలువురు వివిధ కారణాలు, అక్రమాల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏటూరునాగారం, ధర్మసాగర్ ఏఈలు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు.
వచ్చిన వారినీ పంపించారు...
గతంలో 13 మంది ఏఈలను ట్రాన్స్‌కోకు డిప్యూటేషన్‌పై పంపించారు. వారి డిప్యూటేషన్ కాలం ముగియడంతో వారం రోజుల క్రితం తిరిగి వచ్చారు. ట్రాన్స్‌కోలో ఈ 13 మంది ఏఈలతో పని లేదని, వారిని మీ దగ్గరే వినియోగించుకోవాలంటూ స్వయంగా ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాలిచ్చారు. కానీ... ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా 13 మంది ఏఈలను వినియోగించుకోలేని పరిస్థితులు దాపురించాయి. యూనియన్ల మధ్య పంతం కారణంగా 13 మంది ఏఈలనుతిరిగి ట్రాన్స్‌కోకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఆపరేషన్ సర్కిల్‌లో అసలే ఏఈలు లేక కొట్టుమిట్టాడుతుంటే... అధికారులు యూనియన్ల ఒత్తిడికి తలొగ్గి వారిని తిరిగి పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొన్ని నెలల కిందటే ప్రభుత్వానికి, ఈఆర్‌సీకి ఏఈలు, సబ్ ఇంజినీర్లు, కిందిస్థాయి సిబ్బంది భర్తీకి ఎన్పీడీసీఎల్ అధికారులు నివేదికలిచ్చారు. దీనిపై ప్రభుత్వం నేడు... రేపు అంటూ సాగదీస్తూనే ఉంది. ఇప్పటికైనా ఆమోదం లభిస్తే... పనులు ముందుకు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.
మేడారం పనులపై ప్రభావం
రెండు, మూడు సెక్షన్లకు ఇన్‌చార్జ్‌లుగా ఒకరే ఉండడంతో వాటి పర్యవేక్షణ బాధ్యతలు వారికి ఇప్పటికే భారం కాగా... మేడారం జాతర పనులతో వారి పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు అన్న చందంగా తయూరైంది. జాతర నేపథ్యంలో అక్కడ శాఖాపరమైన పనులు చేయడం... కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్న పనులను పరిశీలించడం వారికి కష్టతరంగా మారింది. ఏఈలు, సబ్ ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మేడారం పనుల పర్యవేక్షణ అధికారులకు తలనొప్పిగా మారింది. జాతర పనుల గడువు సమీపిస్తుండడం... ఎక్కడి పనులు అక్కడే ఉండడం... వారిని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారుు.


