పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు | Municipal Department is Heavily Funded in the Telangana budget | Sakshi
Sakshi News home page

పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు

Jul 26 2024 5:17 AM | Updated on Jul 26 2024 5:17 AM

Municipal Department is Heavily Funded in the Telangana budget

అందులో హైదరాబాద్‌కే రూ.10వేల కోట్లు

ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

2023–24లో పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్‌లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్‌ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్‌ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.

హైదరాబాద్‌ అభివృద్ధిపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌
ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్‌ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.

ఇందులో మూసీ రివర్‌ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్‌ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్‌ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్‌ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్‌ఆర్‌ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.

ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...
హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8  ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్‌ పెట్టనున్నట్టు సమాచారం.  

పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

అటవీశాఖకు రూ.1,063 కోట్లు
హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్‌ ఫండ్‌ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్‌ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.

ఇంధన శాఖకు రూ.16,410 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్‌లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్‌ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.

ఉదయ్‌ పథకం కింద రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్‌ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement